Feb 25,2023 01:29
నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి

ప్రజాశక్తి-చీరాల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది అని, బీజేపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండా చివరి బడ్జెట్లో కూడా తీరని అన్యాయం చేశారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ, ప్రత్యేక హౌదా మరియు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోస్ట్‌ ఆఫీస్‌ ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల అన్నింటికీ రావాల్సిన నిధులను కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి వాటిని విడుదల చేయాలి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీటికీ, సంక్షేమ పథకాలన్నిటికీ నిధులు తగ్గించి వాటిని నీరుగారిస్తుందని అన్నారు. అదేవిదంగా విభజన చట్టంలో హామీలు అయిన గిరిజన యూనివర్సిటీ, ఎయిమ్స్‌, కడప ఉక్కు, సంస్థల వూసేలేవని అన్నారు. రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కును కూడా అమ్మకానికి పెట్టిన విషయాలను ప్రజలు అందరూ గమనిస్తున్నారని అన్నారు. దేశంలో ఆధానీ కార్పొరేట్‌ కంపెనీల అభివద్ధికి దేశ ప్రజలు మోడీకి ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశ ఖజానాన్ని కొల్లగొడుతు నాశనం చేస్తున్నారని అన్నారు. పేద ప్రజల శ్రమ, కష్టార్జితంతో వస్తున్న బడ్జెట్‌ నిధులను కార్పొరేట్‌ కంపెనీలకే కట్ట పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ఇటువంటి బడ్జెట్లను వ్యతిరేకించటమే కాకుండా ఇలాంటి శక్తులు అన్నింటిని ఎదుర్కోవాలంటే ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, జిల్లా కమిటీ సభ్యుల టి కృష్ణ మోహన్‌, ఆర్‌ వినోద్‌, సీహెచ్‌ మణిలాల్‌, ఎన్‌ బాబురావు, ఎం వసంతరావు పి.కొండయ్య, బలహీన వర్గాల సమైక్య నాయకులు గోశాల ఆశీర్వాదం, సయ్యద్‌ బాబు, ఎల్‌.జయరాజు బి అగస్టీన్‌, గోరుముచ్చు సుధాకర్‌, కె శరత్‌, సాయి నాగరాణి, పి.సాయిరాం, కె.రాజాలు పలువురు పాల్గొన్నారు.