ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: అందరూ సమిష్టిగా పని చేస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపుకు వైసీపీ కృషి చేయాలని రీజినల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి పిలుపునిచ్చారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతల సమావేశం గురువారం బాపట్ల కోన భవన్‌లో జరిగింది. సమావేశంలో వైసిపి పర్చూరు ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారు ఒకవైపు, ఆమంచికి అనుకూలంగా ఉన్నవారు మరొక వైపు రెండు వర్గాలుగా విజయసాయిరెడ్డి ముందు సమీక్ష సమావేశంలో వైసీపీ నేతలు కూర్చోవడం స్పష్టంగా కనిపించింది. సమావేశం ప్రారంభంలో వ్యక్తిగత సమస్యలు వద్దు కేవలం రాజకీయ సమస్యలు మాత్రమే మాట్లాడండి అని విజయ సాయిరెడ్డి చెప్పారు. సమావేశ ప్రారంభంలో ఆమంచి మాట్లాడుతూ సమావేశం లోపల ప్రజాప్రతినిధులు కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చారని, వారిని బయటకు పంపమని విజయసాయిరెడ్డిని కోరినట్లు, అయితే అంతా వైసిపి కార్యకర్తలు, నాయకులు కాబట్టి అందరిని లోపలే ఉండమని విజయ సాయిరెడ్డి ఆమంచిని వారించినట్లు తెలిసింది. ఆమంచి మాట్లాడేటప్పుడు నియోజకవర్గంలో టిడిపి ఓట్లు 40వేలు దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించడానికి స్థానికంగా ఎవరూ సహకరించడం లేదని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గంలో మూడున్నర సంవత్సరాలుగా వైసిపి టిడిపి (రామనాథంబాబును ఉద్దేశించి) అంటకాగాయని, దానిని నివారించి పార్టీని బలోపేతం చేయడానికి తాను పర్చూరు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. ఐపాడ్ టీం వాళ్లు కూడా తనకు ఎవరు సహకరించడం లేదని చెప్పినట్లుగా తెలిసింది. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన వారితో ఒక్కొక్కరిని రెండు నిమిషాల పాటు మాట్లాడించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో కారంచేడు వైస్ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గాన్ని కులం పేరుతో దూషించిన ఆమంచిపై నియోజకవర్గంలో ఉన్న ఆ సామాజిక వర్గం తీవ్ర మనస్థాపానికి గురైందని చెప్పబోతుండగా రెండో వైపు నుంచి ఆమంచి వర్గీయులు పైకిలేచి యార్లగడ్డ సుబ్బారావుపై విరుచుకు పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడితే అందర్నీ బయటకు పంపించాల్సి ఉంటుందని వారిని హెచ్చరించి యార్లగడ్డ సుబ్బారావుని బయటకు పంపించినట్లు సమాచారం. దీంతో పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల్ని అధిష్టానవర్గం దృష్టికి తీసుకొచ్చేందుకు అక్కడికి వచ్చిన పలువురు అసమ్మతి వైసిపి నేతలకు తాము చెప్పాల్సింది చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో సమావేశం ఏకపక్షంగానే జరిగినట్లు తెలిసింది. నియోజకవర్గంలో అందరూ కలిసి పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా సమాచారం. అయితే చివరలో కొంతమంది అసమ్మతి నేతలు విజయసాయిరెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో ఆమంచి గురించి, పార్టీ వ్యతిరేక పనుల గురించి చర్చించినట్లు సమాచారం. అయితే మీరు ఆమంచి కోసం పని చేస్తారా? లేక జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారా అని విజయసాయిరెడ్డి ప్రశ్న వేసినట్లు తెలిసింది. త్వరలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని, మరికొన్ని విషయాలు అప్పుడు చర్చించుకుందామని విజయ సాయిరెడ్డి అందరితో చెప్పినట్లు సమాచారం.










