*పలు గ్రామాలకు రాకపోకలు బంద్
ప్రజాశక్తి - పొందూరు : రెండు రోజులుగా కురిసిన వర్షానికి మండలంలోని బొడ్డేపల్లి వద్ద గల రైల్వే అండర్‌పాసేజ్‌లో వర్షపునీరు భారీగా నిలిచిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైలు వచ్చే సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిర్మించిన ఈ అండర్‌పాసేజ్‌లో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతుండడంతో, వాహనదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. నీరు నిలిచిపోవడంతో పొందూరు, ఆమదాలవలస మండలాలకు చెందిన సుమారు 15 గ్రామాల వరకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ఈ గ్రామాల నుంచి వాహనదారులు గోరింట నుంచి పెనుబర్తి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల దూరభారం పెరగడంతో పాటు వ్యయప్రయాసలకు లోను కావాల్సి వస్తోంది. వర్షపునీరు తక్కువగా ఉందని భావించిన ఆటో డ్రైవర్ ఆదివారం అండర్‌పాసేజ్‌లోకి వెళ్లడంతో ఆటో మునిగిపోయింది. దీన్ని గమనించిన సమీపంలో ఉన్న వారు నీటిలోకి వెళ్లి ఆటోను వెనక్కి తోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు. అండర్ పాసేజ్‌లో వర్షపునీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.










