Jul 21,2023 22:51

చిత్రపటాన్ని అందుకుంటున్న సాయిధరమ్‌ తేజ్‌

- సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రేక్షకులందరినీ బ్రో చిత్రం అలరిస్తుందని సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. శ్రీకాకుళం వచ్చిన ఆయనకు నగర ముఖద్వారం వద్ద మెగా ఫ్యామిలీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ్నుంచి ఊరేగింపుగా అరసవల్లి చేరుకున్న ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవల్లో పాల్గొన్న అనంతరం అనివెట్టి మండపంలో స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి ఇఒ హరి సూర్యప్రకాష్‌ చిత్రపటాన్ని అందజేశారు. ఆనంతరం గార మండలం శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌, తాను కలిసి నటించిన బ్రో చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అరసవల్లి ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నానని, ఇన్నాళ్లకు అవకాశం లభించిందన్నారు. అనంతరం ఒక ఫంక్షన్‌ హాల్‌లో అభిమానులతో ముచ్చటించారు. కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తైక్వాండో శ్రీను, వైశ్యరాజు మోహన్‌, సాయిధరమ్‌ తేజ్‌ అభిమాన సంఘ అధ్యక్షులు జోగిపాటి వంశీ తదితరులు పాల్గొన్నారు.