Jun 05,2021 06:38

కోవిడ్‌-19 రెండవ వేవ్‌ ప్రళయాన్ని మరిపించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌, ఇతర కారణాల వలన కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికే లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొంది. ఈ రెండవ ఎపిసోడ్‌ పూర్తిగా ముగియక ముందే ధర్డ్‌ వేవ్‌ గురించి చర్చలు, భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పలు విధాలుగా ప్రభుత్వాలకు హెచ్చరికలు, సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మహమ్మారి బారినుండి బయటపడేందుకు ప్రధాన మార్గంగా కనిపిస్తున్న వ్యాక్సినేషన్‌ గురించి కొన్ని విషయాలు పరిశీలిద్దాం.
మన దేశ జనాభా సుమారు 135 కోట్లు. వైద్య నిపుణుల అంచనా ప్రకారం కనీసం 95 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేస్తేనే 'మంద రోగనిరోధక శక్తి' (హెర్డ్‌ ఇమ్యూనిటీ) ఏర్పడి దేశంలో కోవిడ్‌ అదుపు లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసం రాసే నాటికి సుమారు 17 కోట్ల మందికి వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇచ్చారు. లెక్క కోసం 20 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చారనుకుందాం. 95 కోట్లలో 20 కోట్లు తగ్గితే ఇంకా 75 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వవలసి వున్నది. వీరికి రెండు డోసులకు లెక్క వేస్తే 150 కోట్ల వ్యాక్సిన్లు అవసరమౌతాయి. ప్రస్తుతానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు రెండు రకాలు. అవి, భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'కోవాక్సిన్‌', సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పూనే ఉత్పత్తి చేస్తున్న 'కోవిషీల్డ్‌'. మే నెలలో దిగుమతి చేసుకున్న, స్ధానికంగా రెడ్డి ల్యాబ్స్‌ ఉత్పత్తి చేస్తున్న రష్యా వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌-వి' సంగతి పక్కనబెట్టి ఆలోచిద్దాం. జనవరి, 2021లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైన నాటి నుండి మొదటి 115 రోజులలో జరిగిన వ్యాక్సినేషన్‌ వేగం విశ్లేషిస్తే సగటున రోజుకు 15 లక్షల వ్యాక్సిన్లు అందజేశారు. అంటే నెలకు సుమారు 4.5 కోట్లు. సౌలభ్యం కోసం నెలకు 5 కోట్ల వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయనుకుందాం. మిగిలిన 75 కోట్ల మందికి కావాల్సిన 150 కోట్ల డోసులకు ఈ లెక్కన 30 నెలలు పడుతుందన్నమాట. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించిన పత్రంలో జులై చివరకు నెలకు 13 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యేలా చూస్తామని పేర్కొన్నది (అంటే జులై నాటికి భారత్‌ బయోటెక్‌ నెలకు 5.5 కోట్లు, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6.5 కోట్లు, రెడ్డి ల్యాబ్స్‌ ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్‌-వి 1.2 కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తాయని ప్రభుత్వం పేర్కొన్నది). ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు అందించిన ఆర్థిక సహాయం, తీసుకున్న చొరవ వంటి అంశాలు పరిశీలించినట్లయితే ఈ లెక్కల పట్ల విశ్వాసం కలగడం లేదు. పోనీ, కేంద్రం చెప్పినట్లు నెలకు 13 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి జరిగినా మిగిలిన 75 కోట్ల మందికి అవసరమైన 150 కోట్ల వ్యాక్సిన్లు వేయడానికి 11 నెలల పైనే పడుతుందనుకోవాలి. ఈలోగా రూపాంతరం (మ్యుటేషన్‌) చెందుతూ మరింత వేగంగా వ్యాపిస్తూ, మరింత తీవ్రత కల్గిన వ్యాధిగా పరిణమించే అవకాశం ఉన్న కోవిడ్‌-19 మూడవ, నాల్గవ వేవ్‌ లు ప్రజల ముందున్న పెద్ద సవాలు.
వ్యాక్సిన్‌ డ్రైవ్‌ వేగాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ దిశలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మన దేశంలో టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేయగల ఇతర సంస్ధలు ఉన్నాయి. అవసరమైతే కోవాక్సిన్‌ మేధోసంపత్తి హక్కులను సవరించి మిగతా సంస్ధలు ఉత్పత్తి చేయగల్గేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయగల నేపథ్యం ఉన్న పనేషియా బయోటెక్‌, సనోఫి-శాంతా బయోటెక్‌, బయోలాజికల్‌-ఇ, హెస్టర్‌ బయోసైన్సెస్‌, జైడస్‌ కాడిలా వంటి సంస్ధల్ని భాగస్వాముల్ని చేసి దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాలి. ప్రస్తుతం ఈ సంస్ధల అన్ని రకాల వ్యాక్సిన్ల మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం సాలీనా 8.2 బిలియన్లుగా ఉన్నది. కనుక కోవిడ్‌-19 వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తక్షణమే ఈ సంస్ధల్ని భాగస్వాముల్ని చేసే చర్యలు చేపట్టాలి.
విదేశాల నుండి వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలి. అలాగే విదేశీ వ్యాక్సిన్‌ సంస్ధలు తమ వ్యాక్సిన్లను మన దేశంలోని సంస్ధల భాగస్వామ్యంతో ఉత్పత్తి చేసేందుకు జరుపుతున్న సంప్రదింపులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
ఫైజర్‌-బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న ఆర్‌ఎన్‌ఎ టీకా ఇతర దేశాలకు విక్రయిస్తున్న ధర కంటే తక్కువలో మన దేశానికి నాన్‌-ప్రాఫిట్‌ ధరకు (సుమారు ఒక్కొక్క డోసు రూ.1400) ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సంస్ధ మన దేశానికి ఈ ఏడాది చివరికి సుమారు 5 కోట్ల వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి.
రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ''స్పుత్నిక్‌-వి'' ఉత్పత్తిని మన దేశంలో రెడ్డి లేబొరేటరీస్‌ సంస్ధ చేపట్టింది. ఈ సంస్ధతోనే కాకుండా మన దేశం లోని ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న సంస్ధలతో రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డిఐఎఫ్‌) ఇప్పటికే ఒప్పందాల ప్రక్రియ ప్రారంభించింది. ఫలితంగా సుమారు 85 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని స్ధానికంగా ఉత్పత్తి చేయబడ్డ వ్యాక్సిన్లు మన దేశ అవసరాలు తీరేదాకా ఎగుమతి చేయకుండా నిషేధించాలి.
అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్ధ అభివృద్ధి చేసిన ఎడినో వైరస్‌ వెక్టార్‌ ఆధారిత డిఎన్‌ఎ టీకా ఒక్క డోస్‌ తోనే వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. ఈ సంస్ధ మన దేశంలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐఐ), బయోలాజికల్‌-ఇ సంస్ధల భాగస్వామ్యంతో స్ధానికంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యాక్సిన్‌ లభ్యత కోసం కూడా అవసరమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం వేగంగా తీసుకోవాలి.
మన దేశానికే చెందిన జైడస్‌ కాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోవ్‌-డి అనబడే డిఎన్‌ఎ వ్యాక్సిన్‌ త్వరలో అప్రూవల్‌ అయ్యే అవకాశం ఉన్నది. ఈ సంస్ధ జూన్‌ లేదా జులై లో వ్యాక్సిన్‌ విడుదల చేయగల్గితే నెలకు 2 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటు లోకి వస్తాయని అంచనా.
అమెరికాలో మోడర్నా సంస్ధ అభివృద్ధి చేసిన మరో ఆర్‌ఎన్‌ఎ టీకా (ఆర్‌ఎన్‌ఎ-1273) ప్రస్తుతం వున్న అన్ని వ్యాక్సిన్ల లోకీ ఖరీదైనది. ఈ సంస్ధతో కూడా మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి వ్యాక్సిన్ల దిగుమతికి ప్రయత్నం చేయాలి.
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా, నిరాటంకంగా కొనసాగేందుకు స్ధానికంగా దేశీయ టీకాల ఉత్పత్తి పెంచడం, విదేశీ వ్యాక్సిన్ల లభ్యత పెంచుకోవడం వంటి చర్యలతో పాటు ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టాల్సి వుంది. సామాన్య ప్రజలలో వ్యాక్సినేషన్‌ పట్ల అపోహలు, భయాలు తొలగించి, సంసిద్ధత పెరిగేలా వివిధ పద్ధతులలో అవగాహన కల్గించాలి. వ్యాక్సిన్‌ ను కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్‌ టెండర్ల ద్వారా కొనుగోలు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు అందించాలి. వ్యాక్సిన్‌ ధరల్లో వ్యత్యాసాలను తొలగించాలి. కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే ధరకు లభ్యమయ్యేలా విధానం రూపొందించాలి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం సామర్ధ్యం ఉన్న సంస్ధలకు అవసరమైనంత బడ్జెట్‌ ఉదారంగా, సత్వరమే కేటాయించాలి. దేశవ్యాప్తంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలి. సత్వర, సమగ్ర వ్యాక్సినేషన్‌ పాలసీ అమలు ద్వారా మాత్రమే కోవిడ్‌-19 కలుగజేసే తదుపరి పరిణామాలను ఎదుర్కొని మహమ్మారికి అడ్డుకట్ట వేయగలం.    
 

అందరికీ వ్యాక్సిన్‌ అందాలంటే....

                - డా. కె. శివబాబు / వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా /