చిలుకా, కాకీ బూరుగు చెట్టు పైకొమ్మన ఒకటి, కింద కొమ్మన ఒకటి గూళ్లు కట్టుకున్నాయి. కొంతకాలానికి కాకమ్మ అయిదు గుడ్లు పొదిగింది. కానీ వాటిలో రెండు మాత్రమే పిల్లలయ్యాయి. మూడు వారాలు తర్వాత చిలుకా అయిదు గుడ్లను పొదిగింది. అయిదూ పిల్లలయ్యాయి.
అందరు తల్లుల్లాగే చిలుక 'నా పచ్చని పిల్లలూ.. అందమైన ముక్కులూ!' అని, కాకి 'నా చక్కనైన బిడ్డలూ... ముద్దు ముద్దు కూనలూ.. నిగ నిగైన రంగులూ... బంగారు మనసులూ!' అంటూ తమ పిల్లలను చూసి మురిసిపోయేవి. కాకి తన బిడ్డలను మెచ్చుకోవడం విన్న చిలుక 'నిగ నిగలాడే నలుపూ ఓ అందమేనా?!' అంటూ వెటకారంగా మాట్లాడేది.
'ఏం నా పిల్లలకేం తక్కువ? నలుపూ అందమైనదే. అందరూ నల్లని చీకటిలోనే ఆదమరిచి నిద్రపోతారు. అందమైన కలలు కంటారు!' అని బదులు చెప్పేది.
'అబ్బో.. నలుపూ అందమైతే.. ఇక నేనూ, నెమలీ ఎంత మురవాలీ అంట! అందుకే అంటారు కాకి పిల్ల కాకికి ముద్దు! అని' ఎగతాళిగా మాట్లాడేది చిలుక.
రోజూ తల్లులిద్దరూ, ఆహారం కోసం వెళ్ళి వచ్చేలోపు చిలుక పిల్లలూ, కాకి కూనలూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేవి. కొంచెం ఎదిగిన చురుకైన కాకి పిల్లలు ఇల్లు బాగు చేసుకోవటానికి ఎండు పుల్లలు తెచ్చి, కొమ్మల్లో దాచేవి. చిన్న చిన్న పువ్వులు ముక్కున తెచ్చి గూడును అలంకరించేవి. తల్లి కాకి తిరిగొచ్చి తన పిల్లలను ఎంతో మెచ్చుకునేది.
ఒకరోజు చిలుక, కాకి బయటకు వెళ్ళిన సమయంలో బూరుగు చెట్టు చిటారు కొమ్మన ఓ గ్రద్ద వాలింది. దానిని చూసిన చిలుక కూనలు భయంతో అరవసాగాయి. వెంటనే కాకి పిల్లలు రెండూ ఓ ఎండిపోయిన బూరుగు ఆకును అతికష్టం మీద తీసుకొచ్చి, చిలుకమ్మ గూటిపై కప్పేశాయి. పిల్లలను మాట్లాడవద్దని హెచ్చరించాయి. వెంటనే కాకి పిల్లలు పక్కచెట్టు గుబురులో దాక్కొని గమనిస్తూ ఉన్నాయి. చిలుక కూనలను గమనించని గ్రద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకుని, అక్కడ నుంచి ఎగిరిపోయింది.
భయపడిపోయిన చిలుక కూనలను ఆడిస్తూ కాకిపిల్లలు తల్లులు కోసం ఎదురుచూడసాగాయి. చిలుకమ్మ వస్తూనే 'ఏరు మీకు ఇక్కడేం పని? నా గూటిపై బరువైన ఆకులు పడేసి, ఏంటీ అల్లరి?' అంటూ కోప్పడింది. కొద్ది సమయం తర్వాత జరిగిన విషయమంతా తెలుసుకుని కాకి పిల్లలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా దోర జామపండును బహుమతిగా ఇచ్చింది. 'మీరు నిజంగా చాలా అందమైన పిల్లలురా! ఇంకా ఎంతో అందమైన మనసున్న ప్రయోజకులు కూడా!' అంటూ మెచ్చుకుంటూ ఉన్న సమయంలోనే కాకి అక్కడికి వచ్చింది. తన బిడ్డలను పొగడటం విని ఎంతో ఆనందించింది.
'కాకిపిల్ల కాకికే కాదు. అందరికీ ముద్దే!' అంటూ పక్షిపిల్లలన్నీ పాడుతూ ఉండగా నెమలి పిల్లలు నాట్యం చేశాయి.. కోయిల నిజమేనంటూ ఈలలు వేసింది.
* మనోజ నంబూరి