Jan 20,2022 07:17

మహిళల వివాహ వయసు కనీస పరిమితిని 18 నుండి 21 ఏళ్ళకు పెంచాలన్న చట్ట సవరణను మోడీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ ప్రతిపాదన పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ సవరణను సమర్ధించుకుంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలను, వాటి డొల్లతనాన్ని పరిశీలిద్దాం.
వాదన నెం.1: మగవారికి కనీస వయసు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆడవారికి కూడా 21 కనీస వయసుగా ఉండాలి. అప్పుడే లైంగిక సమానత్వం ఏర్పడుతుంది.
సమాధానం: ఈ దేశంలో 18 ఏళ్ళు నిండిన వారు యుక్త వయస్కులుగా పరిగణించబడతారు. వాళ్ళకి ఓటు హక్కు కూడా వస్తుంది. తమని పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగినవారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోలేరా?
లా కమిషన్‌ 2008లో ఇచ్చిన నివేదికలో వివాహ కనీస వయసు అబ్బాయిలకు, అమ్మాయిలకు ఒకటే ఉండాలని చెప్పింది. పెళ్ళి చేసుకునే వారిద్దరిలో అబ్బాయి వయసు అమ్మాయి వయసు కన్నా ఎక్కువగా ఉండాలన్న వాదనకు శాస్త్రీయత గాని హేతుబద్ధత గాని లేదని లా కమిషన్‌ తెలిపింది. మహిళలపై అన్ని రకాల వివక్షతనూ అంతం చేయాలని కోరుతూ నిర్వహించిన అంతర్జాతీయ వేదిక కూడా 18 ఏళ్ళు వివాహానికి కనీస వయసుగా ఉండాలని సిఫార్సు చేసింది.
అందుచేత వివాహ కనీస వయసు స్త్రీ, పురుషులిరువురికీ సమానంగా, 18 ఏళ్ళు ఉండాలి.
వాదన నెం.2: 21 సంవత్సరాలకు కనీస వయసు పెంచడం వలన పుట్టే బిడ్డల ఆరోగ్యం మెరుగౌతుంది.
సమాధానం: 19 ఏళ్ళ లోపు వయసున్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల ఎదుగుదల సవ్యంగా ఉండదని, తక్కువ బరువుతో ఉంటారని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐతే, పుట్టిన దగ్గర నుంచీ ఆడపిల్లలు సరైన పోషణ లేక బలహీనంగా ఉంటూ, వివాహం అయిన తర్వాత 21 ఏళ్ళ వయసులో బిడ్డను కంటే ఆ బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందా? శిశు మరణాలు, ప్రసూతి మరణాలు తగ్గిపోతాయా? ప్రభుత్వం నిజంగా దేశంలో పుట్టే సంతానం ఆరోగ్యంగా, బలంగా ఉండాలని, మాతా, శిశు మరణాలు తగ్గాలని భావిస్తే అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించే బడ్జెట్‌ ను ప్రతీ ఏడూ ఎందుకు తగ్గించేస్తోంది? ఎందుకు తగినన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు? అక్కడ అక్కడ ప్రసూతి సౌకర్యాలను ఎందుకు కల్పించడం లేదు? ప్రసవానంతరం చెల్లించే రూ.6,000 సహాయం విషయంలో షరతులను ఎందుకు విధిస్తున్నారు? మహిళల స్వాస్థ్యత, గర్భిణీ స్త్రీల సంక్షేమం చూసే అంగన్వాడీలను ఆశాలను ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం లేదు ?
కనుక బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలంటే ఆడవారికి పౌష్టికాహారాన్ని అందేటట్టు గ్యారంటీ చేయడం పరిష్కారం అవుతుంది తప్ప....కనీస వివాహ వయసును పెంచడం కాదు.
వాదన నెం:3: చట్టపరంగా వివాహ కనీస వయసును 21కి పెంచడం వలన తల్లిదండ్రులు ఆడపిల్లల ఆరోగ్యం పట్ల, చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.
సమాధానం: అలా చట్టాన్ని మార్చినందువలన 21 ఏళ్ళ లోపు జరిగిన వివాహాలన్నీ చట్టవిరుద్ధం అవుతాయి. బాల్య వివాహాలుగా పరిగణింపబడతాయి. వారికి పుట్టిన సంతానం చట్టపరమైన గుర్తింపు పొందదు. చట్టపరమైన రక్షణలు ఏవీ ఆ కుటుంబాలకు గాని, వారి సంతానానికిగాని లభించవు. ప్రభుత్వ కుటుంబ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి వారికి అర్హత ఉండదు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే (1) విద్యా హక్కు చట్టాన్ని సవరించి 18 సంవత్సరాల వరకూ ఉచిత విద్య పొందే హక్కు కల్పించాలి. కెజి నుండి పిజి దాకా ఉచిత విద్య అందించాలి.
(2) ఉన్నత విద్య అభ్యసించే అమ్మాయిలకు అవకాశాలను, ప్రోత్సాహకాలను బాగా పెంచాలి.
(3) తమకు బలవంతంగా వివాహం తలపెడుతున్నారని ఫిర్యాదు చేసే యువతీ యువకులకు చట్టపరమైన సహాయాన్ని అందించాలి. బలవంతంగా లింగమార్పిడికై వత్తిడి చేస్తున్నారంటూ ఎల్‌జిబిటిక్యు ల నుండి వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుని వారికి తగిన రక్షణ కల్పించాలి. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, సగోత్రీకుల మధ్య వివాహాలు చేసుకోదలిస్తే వారికి రక్షణ కల్పించాలి. స్వలింగ సంబంధాలు ఏర్పరచుకోదలచిన వారికి రక్షణ ఇవ్వాలి.
వాదన నెం.4: వివాహ వయసు ఆలస్యం చేయడం వలన మహిళా సాధికారత సాధ్యపడుతుంది.
సమాధానం: జాతీయ కుటుంబ సర్వే ప్రకారం వివాహితులైన మహిళల్లో 60 శాతం మంది వారికి నచ్చిన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారు. బజారుకు పోవడం వంటి చిన్న విషయం మొదలుకుని బిడ్డని కనాలా, వద్దా అనే నిర్ణయం వరకూ ఆడవాళ్ళకి నిర్ణయాధికారం ఉండడం లేదు. కోర్టులకు వస్తున్న మానభంగం కేసుల్లో 40 శాతం ఫిర్యాదులు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. తమ ఆమోదం లేకుండా పిల్లలు పెళ్ళి చేసుకున్న సందర్భాల్లో వారి తల్లిదండ్రులు ఇటువంటి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రుల అధీనంలో గాని, పోలీసుల అధీనంలో గాని ఉండి వారి వేధింపులకు లోనవుతుంది. తన భర్తను కలుసుకునే హక్కు ఆమెకు ఉండడం లేదు. ఇక కులాంతర, మతాంతర వివాహాల విషయంలో రాజకీయ శక్తుల దాడులకు, అరాచకాలకు ఆ దంపతులు బలవుతున్నారు.
ఈ నేపథ్యంలో వివాహపు కనీస వయసును 18 నుంచి 21కి పెంచితే యుక్త వయసులో ఉండే మహిళకు తన ఇష్టప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకునే వీలుండదు. అంటే మహిళా సాధికారత రాదు సరికదా ఉన్నది కోల్పోతుంది.
ఆ విధంగా యుక్త వయసు వచ్చాక మహిళకున్న స్వేచ్ఛ-జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ-హరించబడుతుంది.
బాల్య వివాహాలు ఎక్కువగా గ్రామీణ పేద కుటుంబాల్లో జరుగుతూంటాయి. కనీస వివాహ వయసు 18 ఏళ్ళుగా ఉన్న ప్రస్తుత కాలంలోనూ ఈ బాల్య వివాహాలు జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు అది 21కి పెరిగితే ఆ పేదలే ఎక్కువగా శిక్షలకు గురవుతారు.
వాదన నెం.5: ఈ చట్ట సవరణ ద్వారా చిన్న వయసులోనే గర్భాన్ని ధరించకుండా నిరోధించవచ్చు.
సమాధానం: తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను తామే తీసుకోగలిగే విధంగా స్త్రీలకు వీలు కల్పించితే అప్పుడు మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వీలవుతుంది. అప్పుడే చిన్న వయసులో గర్భధారణను కూడా నివారించవచ్చు. పెళ్ళి వయసు 18 అంటే దానర్ధం 18 ఏళ్ళకే బిడ్డల్ని కనమని ఆమెపై పెద్దలు, లేదా భర్త బలవంతం చేయడం కాదు కదా. ప్రభుత్వం భద్రంగా అబార్షన్‌ చేయించుకునే సౌకర్యాలను, మహిళలకు సౌకర్యంగా ఉండే సంతాన నిరోధ పద్ధతులను ఎక్కువగా కల్పించాలి.
మహిళలలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఆర్థికంగా మహిళలు స్వంత కాళ్ళ మీద నిలబడగలిగితే మహిళా సాధికారత పెరుగుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళల ఉపాధి కల్పన మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆ పని చేయకుండా వివాహ వయసు కనీస స్థాయిని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటే దానివలన మహిళలకే నష్టం.
2019లో కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో సగటు వివాహ వయస్సు ఇప్పటికే 22.1 సంవత్సరాలుగా ఉంది. దీనిని బట్టి చూసినా అసలు సమస్య వివాహ వయసు కాదని, మహిళలకు సాధికారత, ఆరోగ్యం, చదువు కల్పించి అసాంఘిక, అరాచక శక్తుల నుండి రక్షణ కల్పించడం అని అర్ధం అవుతుంది.
మోడీ ప్రభుత్వం ఆ విషయాల మీద దృష్టి పెట్టకుండా అసందర్భంగా వివాహ వయసును చర్చనీయాంశం చేయడం తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని స్పష్టం అవుతోంది.
          ( ఇటీవల 170 మంది ప్రతినిధులు వివిధ సంఘాల తరపున సమర్పించిన విజ్ఞాపన ఆధారంగా )

                                                                    సుబ్రమణ్యం