
ప్రజాశక్తి-గుంటూరు : హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్ మృతికి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంతాపం తెలిపాయి .శుక్రవారం బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు అధ్యక్షతన జరిగిన సభలో రిటైర్డ్ సైంటిస్ట్, జెవివి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్..వేణుగోపాలరావు మాట్లాడుతూ అందరికీ మూడు పూటలా తిండి పెడుతున్న రైతుల కడుపు నింపాలని, వారి కుటుంబాల్లో సిరులు పండాలని, యావత్తు ప్రజానీకానికి ఆహారాన్ని అందించాలని స్వామినాథన్ ఎంతో కృషి చేశారన్నారు. బ్రిటిష్‌వారి అరాచకాలు, అకృత్యాలు ఆయన మనసుని కదిలించాయని, కానీ ఆయన ఆయుధాలు పట్టకుండానే ఆయన ఆలోచనలతో దేశంలో ఆహార కొరతను ఎదుర్కోవడానికి మేలైన వరి, గోధుమ, మొక్కజొన్న వంగడాల రూపకల్పంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చిన డాక్టర్ స్వామినాథన్ మరువలేని మహనీయుడు అన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ మాజీ డైరెక్టర్ బండ్ల సూరయ్య చౌదరి మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఆయన అనేక సిఫార్సులు కేంద్రానికి అందించారని, కానీ ఆయా సిఫారసుల అమలులో పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు కె.రాజశేఖర్‌రెడ్డి, పి.శివాజీ, వై.నేతాజీ, వి.నరసింహారావు, కె.కోటయ్య, యు.నాగేశ్వరరావు, ఎం.శివయ్య, బి.శ్రీనివాసరావు, ఎ.అరుణ్ కుమార్, కె.నళినీకాంత్, బి.ముత్యాలరావు, కె.విఠల్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ఫిరంగిపురం : మండలంలోని పొనుగుపాడులో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించగా మస్తాన్‌వలి అధ్యక్షత వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి సీతారామాంజనేయులు మాట్లాడుతూ రైతులపై జాతీయ కమిషన్ అధ్యక్షులుగా కనీస మద్దతు ధరను అందించాలని సిఫార్సు చేశారని చెప్పారు. పంటలకు ధరల్లేక రైతులు నష్టాలు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవి ఆగాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు. ఆయనకు భారతరత్న బిరుదును ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కె.వెంకటేశ్వర్లు, డి.రామారావు, కె.శ్రీనివాస్, టి.వెంకయ్య, జి.వెంకటేశ్వరరావు, వై.కృష్ణ, పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : స్థానిక వైసిపి ప్రాంతీయ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడారు. మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైసిపి నాయకులు నూరిఫాతిమా, ఎం.రాధా, ఎం.శ్రీనివాసరెడ్డి, ఘనీక ఝాన్సీ పాల్గొన్నారు.
నేడు ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ వడ్డేశ్వరంలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం (కెబి భవన్)లో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సభకు రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు, రైతు సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.