ప్రజాశక్తి-కంచరపాలెం, ఆరిలోవ : రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి విడదల రజిని పేర్కొన్నారు. జివిఎంసి పరిధిలోని తూర్పు, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో పలు చోట్ల నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలను ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ రాజాబాబులతో కలిసి ఆమె ప్రారంభించారు. ముందుగా జివిఎంసి 11వ వార్డు బాలాజీ నగర్‌లో రూ.98 లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, 13వ వార్డులో శ్రీ కృష్ణాపురం నందు రూ.102.00 లక్షలు, తోటగరువు నందు రూ.104.50 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గం పరిధి 41వ వార్డు రైల్వే న్యూకాలనీ నందు రూ.103.50 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డు ఎఎస్‌ఆర్ నగర్ నందు రూ.99.90 లక్షలు, 53వ వార్డు శివనగర్ నందు రూ.99.98 లక్షలు, 43వ వార్డు నరసింహ నగర్ నుందు 23.88 లక్షల ఎన్‌యుహెచ్‌యమ్ నిధులతో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జివియంసి పరిధిలో నూతనంగా 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన భవనాల్లో యుపిహెచ్ సీలను ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఉచిత వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎనలేని కషి చేస్తుందని అన్నారు.
హుదూద్ ఇళ్లు ప్రారంభం
వైఎస్‌ఆర్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్ క్రింద హుదూద్ తుపాన్ నిర్వాసితులకు ముడసర్లోవలో రూ.1536.00 లక్షల పిఎమ్‌ఎవై నిధులతో నిర్మించిన 320 ఇళ్లను మంత్రి విడదల రజిని ప్రారంభించి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, జిల్లా వైద్యాధికారి కె.విజయలక్ష్మి, కార్పొరేటర్లు, పలువురు వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ కెల్ల గైర్హాజరు..
జివిఎంసి 13వ వార్డు పరిధి పైనాపిల్ కాలనీలో హుదూద్ బాధితుల కోసం నిర్మించిన గృహాల ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ కెల్ల సునీత గైర్హాజరయ్యారు. వార్డు పరిధిలో ప్రారంభోత్సవానికి ముందు రోజు రాత్రి ఆహ్వానించడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వార్డు ప్రజా ప్రతినిధికి ముందుగా ఆహ్వానించక పోవడం అవమానంగా ఆమె భావిస్తున్నట్టు సమాచారం.










