ప్రజాశక్తి - ఏలూరు
విపత్తుల సమయంలో తీసుకునే జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలపై ఇచ్చిన శిక్షణలో ఆపదమిత్ర వాలంటీర్లు వాటిని ఆకళింపు చేసుకుని సమాజానికి ఉపయోగపడాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రకృతి వైపరిత్యాల నిర్వహణపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, ఎపిఎస్‌డిఎంఎ, ఎపిఎస్‌ఐఆర్ డిపిఆర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జెవిఆర్ నగర్‌లోని సోషల్ సర్వీస్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన ఐదో బ్యాచ్ ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు, తుపాన్లు వంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం మాత్రమే అన్ని చర్యలు తీసుకోవడం సాధ్యంకాదని ఇందులో ప్రజాభాగస్వామ్యంకూడా ఎంతో అవసరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ చేపట్టామన్నారు. ఈ శిక్షణలో ఆపదమిత్రలకు అందించిన కార్యక్రమాలను ఒకసారి ఆకళింపు చేసుకోవాలన్నారు. విపత్తుల సమయంలో ఆపదమిత్రలు తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించి బాధితప్రాంత ప్రజలకు ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా రక్షించాలన్నారు. వీరు అగ్నిమాపక తదితర శాఖలఅధికారులు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి అందించిన మెటీరియల్‌ను వినియోగించుకోవడంలో నైపుణ్యం సాధించాలన్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, కలిదిండి, ఏలూరు, దెందులూరు, గణపవరం, కైకలూరు, నూజివీడు, పెదపాడు, పెంటపాడు, భీమడోలు మండలాల్లోని 251 మంది ఆపద మిత్రలుగా శిక్షణ పొందారన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు శిక్షకులను తీసుకువెళ్లి వాస్తవ పరిస్థితులపై సమగ్రమైన అవగాహన కల్పించడంతో పాటు గ్రామ, పంచాయతీల్లో లభించే సహజ వనరులు, సామాజిక వనరులు, సోషల్ మ్యాపింగ్, గత విపత్తుల చరిత్ర వంటి పలుఅంశాలపై ఫీల్డ్ విజిట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. జెడ్‌పి సిఇఒ రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 30వ తేదీ వరకు 12 రోజుల పాటు ఐదో బ్యాచ్ ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం శిక్షణపొందిన వారికి సేఫ్టి కిట్స్‌తో పాటు సర్టిఫికెట్లు కలెక్టర్ అందజేశారు.










