
- నేడు మూడో వర్ధంతి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: ఎప్పుడూ తెల్లటి జుబ్బా (అంగి), పంచ కట్టుతో సంప్రదాయ పద్ధతిలో కనిపించే తెలకపల్లి నరసింహయ్య ఆహార్యం అసలు సిసలైన పండితుడిని గుర్తుకు తెస్తుంది. ఏడు దశాబ్దాలపాటు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆయన నిరాడంబరంగా ఉంటూనే బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించారు. ఆయన భాష స్వచ్ఛమైన ఉచ్ఛాÛరణ, హడావుడీ లేకుండా విషయ పరిజ్ఞానం, పాఠం చెప్పే తీరు ఇట్టే కట్టిపడేస్తుంది. మంగళవారం నరసింహయ్య మూడో వర్ధంతి సందర్భంగా ప్రజాశక్తి ప్రత్యేక కథనం...
కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజా ఉద్యమాల్లో మమేకమవుతూనే మంచి ఉపాధ్యాయుడిలా తెలకపల్లి నరసింహయ్య రాజకీయ అర్ధశాస్త్రాన్ని బోధించిన పాఠాలు ఎందరినో కమ్యునిస్టు ఉద్యమంలోకి తీసుకురావడమే కాకుండా జాతీయ స్థాయి నాయకులను తయారు చేసింది. వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కమ్యూనిస్టు కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన రాజకీయ అర్థశాస్త్రం తరగతులకు ఆ ఊరి మునసబు హాజరై ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన ఎవరో కాదు జాతీయ స్థాయిలో వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాలపై అనేక పరిశోధనలు, అధ్యయనాలు చేసిన రైతు సంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి. జిల్లా నాయకులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎంతో మంది ఉద్యమకారులకు మార్గదర్శి అయ్యారు. ప్రజా ఉద్యమాల్లోనే కాదు ఆయన మార్గదర్శకంలో నడిచిన వ్యాపారస్తులు ఆయన చూపిన క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరిన వారూ ఉన్నారు.
టి.నరసింహయ్య సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1928 జూన్ 8న జన్మించారు. ఆయన ప్రస్థానమంతా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారి మధ్యనే సాగింది. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నా ఆయన ఉద్యమాన్ని మలిచిన తీరులోనే కుటుంబాన్ని కూడా ఆదర్శ కుటుంబంగానే తీర్చిదిద్దారు. ఆయన సతీమణి టిసి.లక్ష్మమ్మ కూడా సంప్రదాయ కట్టుబాట్లను తెంచుకుని ఆయన మార్గదర్శకంలోనే ప్రజా ఉద్యమంలో పని చేశారు. టి.నరసింహయ్య, టిసి లక్ష్మమ్మ ఇద్దరూ ఆదర్శ దంపతులుగా నిలిచి తమ పిల్లలను ముగ్గురిని కూడా ఆదర్శనీయంగా తీర్చిదిద్దారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులుగా, సీనియర్ జర్మలిస్టుగా, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి ఆయన కుమారుల్లో ఒకరు. మరో ఇద్దరు కొడుకులు హరిశర్మ, చంద్రశేఖరశర్మ కూడా తల్లిదండ్రుల బాటలోనే నడుస్తున్నారు. కుమారులే కాదు ఆయన సమీప బంధువులు సైతం ప్రజా ఉద్యమాల్లో మమేకమైన పరిస్థితి ఉంది. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ముందు తను ఆచరించాలనే పద్ధతిలో టి.నరసింహయ్య తన కుటుంబాన్ని ప్రజా ఉద్యమాల్లోకి తీసుకువచ్చి జిల్లాలో ప్రజా ఉద్యమానికి పూనుకోవడం మూలంగానే ఇప్పుడు జిల్లా అంతటా కమ్యునిస్టు ఉద్యమం విస్తరించింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు, ముఠా రాజకీయలకు అలవాలమైన జిల్లాలో ఏ కార్యకర్త కూడా ఫ్యాక్షన్ వైపు నడవకుండా బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన నరసింహయ్య అందరికీ ఆదర్శనీయుడయ్యారు. ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపించే దక్షత జిల్లా కలెక్టర్లను సైతం ఆశ్చర్య పరిచేది. టి.నరసింహయ్య సిపిఎం జిల్లా కార్యదర్శిగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు వాటి పరిష్కారం కోసం అధికారులు ఆయన సలహాలు, సూచనలు కోరేవారు. కేంద్ర కరువు బృందాలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్లు నరసింహయ్యకు స్వయంగా ఫోన్ చేసి సలహాలు కోరడంతో పాటు కేంద్ర బృందానికి కూడా మీ నివేదికలు ఇవ్వమని కోరేవారంటే ఆయన దక్షత ఏపాటిదో అవగతమవుతుంది. ఆయన 2019 జనవరి 18న తన 90వ ఏట మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నాయకులను తీర్చిదిద్ది కర్నూలు జిల్లాలో బలమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన నరసింహయ్య ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.
నేడు 'పెరుగుతున్న మతోన్మాద ప్రమాదం
- లౌకిక శక్తుల కర్తవ్యం'పై సదస్సు
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్
కర్నూలు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలకపల్లి నరసింహయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా ''పెరుగుతున్న మతోన్మాద ప్రమాదం-లౌకిక శక్తుల కర్తవ్యం' అంశంపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు టౌన్ సి.క్యాంప్ సెంటర్‌లోని లలిత కళా సమితి ఆడిటోరియంలో సదస్సు ఉంటుందని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ కె.ప్రభాకర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రధాన వక్తలుగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి హాజరవుతారని తెలిపారు. మత సామరస్యం కోరుకునే వారు లౌకిక వాదులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.