Aug 23,2023 21:03

ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

 కడప : ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తిదాయకం, ఆదర్శ ప్రాయుడని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, తమ పిల్లలకు కూడా కష్టపడి క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్లే విధంగా నేర్పించాలని కలెక్టర్‌ వి.విజరురామరాజు అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్‌లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం పంతులు భారతదేశానికి చెందిన న్యాయవాది, వలసవాద వ్యతిరేక జాతీయవాది, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త అని అన్నారు. నైతిక విలువలను ప్రాణంగా భావించే ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలనలో ఉన్న మద్రాస్‌ ప్రెసిడెంట్‌కి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారని, ఆంధ్ర రాష్ట్రం మద్రాస్‌ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. టంగుటూరికు ఆంధ్ర కేసరి (ఆంధ్ర సింహం) అనే బిరుదు కూడా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ టంగుటూరి ప్రకాశం పంతులను ఆదర్శంగా స్ఫూర్తి దాయంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వి.విజరురామరాజుతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.