ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్‌హాల్ లో గురువారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల హెచ్‌ఎంలకు, ప్రిన్సిపాళ్లకు, కరెస్పాండెంట్లకు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. వెయ్యి కేజీల లోపు ప్లాస్టిక్ ను సేకరించిన వారికి 50 వేల రూపాయలు, వెయ్యి కేజీల లోపు ప్లాస్టిక్ ను సేకరించిన వారికి 20 వేల రూపాయలు నగదు బహుమతి ఉంటుందని వారు ప్రకటించారు. పట్టణ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు అవుతూ పూర్తిగా సహకరించాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగులందరికీ కూడా వార్డులవారీగా ఈనెల 23వ తేదీన పట్టణంలోని ప్రభుత్వ బాలుర మైదానంలో ప్లాస్టిక్‌ను సేకరించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, సహాయ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు మహబూబ్ బాషా, శాంసన్,ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చాంద్‌బాషా, ధర్మవరం పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










