Nov 02,2023 21:21

బాధిత కుటుంబానికి చెక్కు అందిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  అందరి సహకారం, సమన్వయంతో పైడితల్లి అమ్మవారి పండగను ఆనందంగా జరుపుకున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు. పైడితల్లమ్మ చదురుగుడి వద్ద సిరిమాను తయారీదారులను సత్కరించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పైడితల్లమ్మ జాతరలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునే సిరిమానును రూపుదిద్దిన తాళ్లపూడి సోమినాయుడు, కోరాడ నారాయణ, కె.రమణ, మహంతి జగన్నాథం, గురాన బుల్లి, గన్నేవరపు శ్రీనును సత్కరించారు. పైడితల్లమ్మ చిత్రపటాలను బహూకరించారు. కొంత ధన సహాయాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలుస్తున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎన్నడూ లేని విధంగా ఎంతో సరదా సందళ్ళతో సిరిమాను జాతర జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతరను సజావుగా నిర్వహించి అందరి మన్నలను పొందుతున్న అధికారులను అభినందించారు. కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్‌ సుధారాణి, తాహశీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు, పూజారి బంటుపల్లి వెంకట్రావు, దేవస్థానం పాలకమండలి సభ్యులు, పైడిమాంబ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సతీష్‌ కుటుంబానికి పరిహారం అందజేత
గత నెల 29వ తేదీన కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో నగరంలోని తోటపాలెం ప్రాంతానికి చెందిన చల్లా సతీష్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారానికి సంబంధించి చెక్కును డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి గురువారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తహశీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి సహాయ నిధి నుండి కొంత మొత్తం, రైల్వే శాఖ కొంత మొత్తం మృతుని కుటుంబ సభ్యుల ఖాతాలకు నేరుగా జమ కానున్నదని తెలిపారు. కార్యక్రమంలో మృతుడు సతీష్‌ తల్లి, భార్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.