Oct 29,2023 21:32

కెఎల్‌.సుధారాణి

సోమ, మంగళవారాల్లో జరిగే పైడితల్లమ్మ జాతరను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పైడితల్లమ్మ దేవస్థానం సహాయ కమిషనర్‌ కె.ఎల్‌.సుధారాణి తెలిపారు. దేవాదాయ శాఖ తరపున దిగ్విజయంగా పండగ నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని రకాల చర్యలూ తీసుకున్నామని చెప్పారు. పండగకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి, పండగను విజయవంతం చేసేందుకు పలు సూచనలు చేశారని వివరించారు. పైడితల్లమ్మ జాతర నేపథ్యంలో 'ప్రజాశక్తి'కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు..
ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : 
పైడితల్లమ్మ పండగకు ఈ ఏడాది ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు.? యాత్రికలు ఎంతమంది వచ్చే అవకాశముంది.?
ఏటా ఏటా మాదిరిగానే ఈ ఏడాది అమ్మవారి పండగ తొలేళ్ల ఉత్సవం, సిరిమాను సంబరాలు విజయవంతంగా జరిపేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకున్నాం. ఈ ఏడాది మూడు లక్షల దాటి యాత్రికలు నగరానికి వచ్చే అవకాశమున్నందున వారికి అమ్మవారి దర్శనం బాగా జరిగేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాం.
దర్శనానికి ఎన్ని క్యూలైన్లు ఏర్పాటు చేశారు.? దర్శనాలు ప్రశాంతంగా జరిగే విదంగా తీసుకున్న చర్యలేమిటి.?
అమ్మవారి దర్శనం కోసం లక్షల సంఖ్యలో యాత్రికలు రానుండటంతో దర్శనాలు ప్రశాంతగా జరిగే విదంగా రెండు ప్రాంతాల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశాం. అమ్మవారి గుడి నుంచి మూడు లాంతర్లు వైపు రెండు, అమ్మవారి గుడి నుంచి ఎంజిరోడ్డు వైపు రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశాం. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండకు గురి కాకుండా చలువ పందిరిలు ఇప్పటికే ఏర్పాటు చేశాం.
క్యూలైన్లలో యాత్రికలకు గంటలు కొద్ది ఉండాల్సి వస్తుంది. వారికి ఏమైనా సౌకర్యాలు కల్పించే అవకాశముందా.?
క్యూలైన్లలో ఉన్న యాత్రికలకు ఇబ్బంది కలగకుండా మజ్జిగ, తాగునీరు, చిన్న పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్లు అందిస్తాం. వీటిని సరఫరా చేసేందుకు కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. వాటికి ఆ భాద్యతలు అప్పగించాం.
దర్శనం కోసం ప్రత్యేక పాసులు,టోకన్లు ఏర్పాటు చేశారా.?
అమ్మవారి దర్శనం కోసం ఉచిత క్యూలైను ఒకటి ఉంటుంది. రెండవ క్యూలైన్‌లో రూ.50 టిక్కెట్‌ తీసుకున్న వారి దర్శనానికి లైన్‌ ఉంటుంది. ప్రత్యేకంగా రూ.300 దర్శనం టిక్కెట్‌ సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల లోపు ఉంటుంది. రూ.300 టిక్కెట్లు బ్యాంకుల్లో అందుబాటులో ఉంచాం.
పండగకు ఎంత మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.?
పండగకు లక్షలు సంఖ్యలో యాత్రికలు రానుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దేవాదయశాఖ నుంచి 150 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. వీరికి మూడు షిప్టుల్లో బాధ్యతలు అప్పగించాం. ఉత్సవాలకు ప్రత్యేకాధికారిగా రీజనల్‌ దేవాదయశాఖ కమిషనర్‌, రాజమండ్రికి చెందిన ఎంవి.సురేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఆయన పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
పండగకు నిధులు ఎంత కేటాయించారు.?
రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఆర్థికంగా ఎటువంటి నిధులూ మంజూరు చేయలేదు. దేవాదయశాఖ మంత్రి పండగ రోజు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పండగకు దేవస్థానం నిధులు రూ.15 లక్షలు కేటాయించాం. ఈ డబ్బులతో పండగకు అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నాం.
సిరిమాను సంభరం సమయానికి జరిగే విదంగా తీసుకున్న జాగ్రత్తలు, చర్యలేమిటి.?
సిరిమాను మద్యాహ్నాం 3.30గంటలకు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. దీని కోసం పోలీసు, అటవిశాఖ, ఆర్‌డిఒలతో సమన్వయం చేసుకున్నాం. చీకటి పడక ముందే సకాలంలో సిరిమాను పూర్తి చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 11గంటలకే హుకుంపేట నుంచి సిరిమాను అమ్మవారి గుడి వద్దకు తీసుకొచ్చే విదంగా నిర్ణయించాం. ఆలయం వద్దకు 1గంటల లోపు సిరిమాను చేరుకుంటే సిరిమాను బండికి కట్టేందకు రెండు గంటలు సమయం పడుతుంది. దీంతో సరిగ్గా 3.30 గంటలకు సిరిమాను తిరిగే విదంగా చర్యలు తీసుకున్నాం. మంత్రులు, కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం.
పండగ నేపథ్యంలో ప్రసాదాలు ఎన్ని సిద్దం చేస్తున్నారు.? వాటి ధరను ఏవిదంగా నిర్ణయించారు.?
పండగ నేపథ్యంలో 10వేల లడ్డూలు, పులి హోర ప్యాకెట్లు సిద్దం చేసి ఉంచాం. అప్పటికప్పుడు ప్రసాదాలు విక్రయాలు జరుగుతున్న పరిస్తితిని బట్టి అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. ప్రసాదాలు తీసుకున్న వారందరికి అందే విదంగా సిద్దం చేసి ఉంచుతున్నాం. లడ్డూ రూ. 15లు, పులిహోర రూ.10లుగా ధరను నిర్ణయించాం.