
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అందరి సమన్వయంతో పైడితల్లి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతం కన్నా మరింత వైభవంగా సిరిమాను సంబరాన్ని నిర్వహించేందుకు అధికారులతో పాటు పాలకమండలి సభ్యులు ప్రజలు సహకరించాలని కోరారు. సిరిమాను నిర్ణీత సమయానికి చదురు గుడికి వచ్చే విధంగా చూడాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం జరగాలన్నారు.
సమావేశం అనంతరం కమిషనర్ ఆర్ శ్రీరాముల నాయుడు మీడియాతో మాట్లాడుతూ పండగకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 400 మంది అదనపు పారిశుధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు మెరుగైన పారిశుధ్య విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. నగరంలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డులు మినహా మిగిలినవి తొలగిస్తున్నట్లు చెప్పారు. 25 కేంద్రాలలో తాగునీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18 చోట్ల పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలోని ప్రధాన జంక్షన్లో విద్యుత్ కాంతులతో అలంకరించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, ఆర్‌డిఒ సూర్యకళ, ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, టౌన్ డిఎస్‌పి గోవిందరావు, ట్రాఫిక్ డిఎస్‌పి విశ్వనాథ్, పైడితలమ్మ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, సహాయ కమిషనర్ ప్రసాదరావు, తహసిల్దార్ శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
అదనపు తరగతి గదులు ప్రారంభం
నగరంలోని బుంగవీధిలో వైజాగ్ ఆల్ఫా రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో నిర్మించిన తరగతి గదులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జి ఆర్ ఇన్ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సౌజన్యంతో రెండు తరగతి గదులను నిర్మించారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ రేగాన రూపాదేవి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, రౌండ్ టేబుల్ చైర్మన్ రవివర్మ, భువణ్, జోనల్ ఇంఛార్జి గుజ్జల నారాయణరావు, కార్పొరేటర్ అల్లు చాణిక్య తదితరులు పాల్గొన్నారు.
జెఎఎస్ పరిశీలన
లంకాపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యసురక్షలో భాగంగా ఇప్పటివరకు నగరంలో 8,500 మంది వరకు ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. సుమారు 120 వరకు శాస్త్ర చికిత్సలకు రిఫర్ చేశారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పొట్నూరు శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.