Dec 16,2022 22:30

సంతకాల పుస్తకాలను తలపై పెట్టుకుని భారీ ప్రదర్శన

అందరి కోరిక అదే...!
అన్నమయ్య ఇల్లు పునర్నిర్మించాలి
11.5 లక్షల సంతకాలు సేకరణ
గృహసాధన సమితి భారీ ర్యాలీ
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.. హైందవ భక్తుల, అన్నమయ్య అభిమానుల, సమతావాదుల.. యావన్మంది తెలుగు ప్రజల కోరిక ఒక్కటే... తిరుమలలో అన్నమయ్య ఇంటిని, మండపాన్ని టిటిడి పున్ణనిర్మించాలి' అంటూ అన్నమయ్య గృహ సాధన సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య కళాక్షేత్రం, జైభారత్‌, చినుకు కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులు భారీగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కపిలతీర్థం నుంచి అన్నమయ్య కీర్తనలను పాడుకుంటూ అన్నారావు సర్కిల్‌ మీదుగా తిరుమల తిరుపతి పరిపాలనా భవనం వద్దకు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్నమయ్య ఇంటి సాధన కోసం సేకరించిన 11 లక్షల 50వేల సంతకాలను టిటిడి జెఇఒ వీరబ్రహ్మానికి అందజేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయశంకర స్వామి మాట్లాడుతూ పద కవితా పితామహుడు, తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య మండపాన్ని, ఇంటిని తిరుమల కొండపై మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 2003లో కూల్చేశారని, టిటిడి ఘోరమైన అపచారానికి పాల్పడిందని, కోట్లాదిమంది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఈ దారుణాన్ని సరిదిద్దాలని అన్నమయ్య గృహ సాధన సమితిగా జూన్‌ 28న ఏర్పడింది. వర్షాలు, ఎండలు సైతం లెక్కచేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో దేవాలయాలను, ఆధ్యాత్మిక క్షేత్రాలను, అంగళ్లు, పాఠశాలలను ఎక్కడ జనం గుమిగూడితో అక్కడకు వెళ్లి అన్నమయ్యకు జరిగిన అన్యాయాన్ని వివరించామన్నారు. ప్రతిఒక్కరూ అన్నమయ్యకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. పది లక్షల సంతకాలను లక్ష్యంగాపెట్టుకన్నాం. అనూహ్యరీతిలో 11 లక్షల 50వేల సంతకాలు పూర్తి చేశాం. ఈ సందర్భంగా సేకరించిన సంతకాల పుస్తకాలను నెత్తిపై పెట్టుకుని టిటిడి అధికారులకు వివరించనున్నామని చెప్పారు. అనంతరం ఆరుగురిని లోనికి పిలిపించి గంటసేపు జెఇఒ చర్చించారు. ఈవో దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్నమయ్య గృహ సాధన కమిటి రాష్ట్ర కార్యదర్శి త్రిమూర్తులు, వీరబ్రహ్మేంద్రస్వామి మునిమనవళ్లు వీరభట్లయ్య, కోవిదా సహోదయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అనూహ్యరెడ్డి, చినుకు కల్చర్‌ సొసైటీ వ్యవస్థాపకులు పిఎన్‌ మూర్తి పాల్గొన్నారు.