Feb 07,2023 22:54

ప్రజాశక్తి-విజయవాడ: మధురానగర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యుబి) పనులు పూర్తి చేయాలని, పాడైపోయిన రోడ్లు బాగు చేయాలని కోరుతూ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పౌరసంక్షేమ సంఘం నాయకులు భూపతి రమణారావు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మధురానగర్‌ అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ఐదు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం వలన మధురానగర్‌ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గడపగడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు దీనిపై ప్రశ్నించడం జరిగిందని, అయినా ఎమ్మెల్యే స్పందిస్తున్న పరిస్థితి లేదన్నారు. విజయవాడ నగరం కష్ణానది పక్కనే ఉన్నప్పటికీ ఇళ్లకు నీటి మీటర్లు బిగించి ప్రజలపై నీటి భారాన్ని మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి మీటర్లు పెట్టి లీటర్ల చొప్పున లెక్క గట్టి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారన్నారు. భారమైన నీటి మీటర్లకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు, పౌరసంక్షేమ సంఘం నాయకులు వై.కృష్ణయ్య, బి.చిన్న, కొరమయ్య, ప్రదీప్‌, జగదీష్‌, వై.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.