May 24,2023 22:50

ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్‌ : వాంబే కాలనీ నుండి దేవినగర్‌ వైపు వెళ్లే రైల్వే ట్రాక్‌ పై అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ బుధవారం వాంబే కాలనీ రైల్వే ట్రాక్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు,కె. కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గారావు పాల్గొని మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుండి వాంబే కాలనీ రైల్వే ట్రాక్‌ వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మిస్తామని గత పాలకులు నేడు అధికారంలో ఉన్న వైసిపి, బిజెపి ప్రభుత్వాలు వాగ్దానాలు తప్ప బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారని తెలిపారు. ఈ ప్రాంతంలో రోజు ప్రయాణించేవారు సింగ్‌ నగర్‌ ఫ్లైఓవర్‌ పై వెళ్లాలంటే అధిక ఖర్చులతో పాటు ఎక్కువ సమయం కావటంతో పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులలో సమస్యను పరిష్కరించకపోగా రోజువారి కూలి పనులు చేసుకునే పేదవారిపై రైల్వే పోలీసులు నడిచి వెళ్లే వారికి 500, రూపాయలు సైకిళ్లపై వెళ్లే వారికి1000, రూపాయలు లేదంటే 3. లేదా 6 ఆరు నెలలు జైలు శిక్షలు విధిస్తామని బెదిరించటం ఫైన్‌ వేయటం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి పూనుకోవాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన సి.పి.ఎం నిలబడి దశల వారి ఆందోళన చేపడుతామని ఫైన్‌ లు ఆపాలని లేని పక్షంలో ప్రత్యక్షంగా అడ్డుకుంటా మని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం నగర కమిటీ సభ్యులు ఎస్‌.కె. పీరు సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.