ప్రజాశక్తి-నక్కపల్లి:రైతుల్లో తుఫాను గుబులు రేకెత్తిస్తుంది. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అన్నదాత ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. చివరి గింజలు చేతికందే సమయంలో తుఫాను గండం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. మండలంలో ఈ ఏడాది వరి సాగు విస్తారంగా పండింది. రైతులు మండలంలో అన్ని గ్రామాల్లోనూ వరి సాగు చేసారు. అన్నిచోట్ల వరి కోత దశకు చేరుకుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో రైతులు వరి కోతలు కోసి కుప్పలు వేసుకోగా, కొన్నిచోట్ల వరి పనలు పొలాల్లోనే ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణం పూర్తిగా మారి పోవడంతో రైతులు అప్రమత్తమై వరి పొలాల్లో కోత కోసిన వరి పనులను కుప్పలు వేసుకునే పనిలో రైతులు నిమగమయ్యారు. శుక్రవారం చిరుజల్లులు కురవడంతో రైతన్నకు చినుకు భయం పట్టుకుంది. కోత దశకు చేరుకున్న వరి చేతికి అందుతుందో లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి రైతులు వరి పంటను పండించారు. పలువురు రైతులు అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టారు. ఈ దశలో తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురిసినట్లయితే అన్నదాతకు తీవ్ర నష్టం జరుగుతుంది. అప్పుల ఊబులో రైతులు కూరికి పోతారు.
తుఫాను హెచ్చరిక నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్ గొడిచెర్ల లో పర్యటించి రైతులను అప్రమత్తం చేశారు. రెండు మూడు రోజులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసి పొలాల్లో ఉన్న వరి పనలను వెంటనే కుప్పలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
కోటవురట్ల:ఆరుగాలం కష్టపడి పండించిన పంట మాండూస్ తుఫాను రైతన్నల్లో ఆందోళన కలిగిస్తుంది. మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో దాదాపు 1914 హెక్టార్లలో వరి సాగు చేశారు. చివరి దశకు చేరుకున్న వరి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో, రైతులు కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి తేలికపాటి చిరుజల్లులు పడుతుండటంతో రైతులు మరింత ఆందోళన మొదలైంది. కొన్నిచోట్ల పంట పూర్తిగా పండిన తరుణంలో వర్షం అధికమైతే నేలపాలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోలుగుంట:మాండోస్ తుపాన్ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో కలవరపడుతున్నారు. మండలంలో వాతావరణంలో మార్పుల నేపధ్యంలో వరి రైతులు హడావుడిగా పంటను కుప్పలుగా వేస్తున్నారు. ఇంకా 50 శాతం విస్తీర్ణంలో వరి పైరు పక్వానికి వచ్చి కోతకు సిద్దంగా ఉంది. పంట చేతికొచ్చే సమయంలో తుపాన్ కారణంగా పంటలు దెబ్బతింటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కుప్పలు పెట్టేందుకు పరుగులు
బుచ్చయ్యపేట:తుపాన్ నేపథ్యంలో శుక్రవారం చిన్న చిన్న చినుకులు పడడంతో రైతులు తమ పొలాల్లోని వరి చేను కుప్పలుగా పెట్టేందుకు పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం నుండి వాతావరణ మబ్బుగా ఉంది. మధ్యాహ్నం సమయానికి చిన్న చిన్న చినుకులు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కోసిన వరి పంటను కుప్పలుగా పెట్టడానికి ఇబ్బందులు పడ్డారు. మండలంలోని బుచ్చయ్యపేట, కందిపూడి, చిన్నప్పన్నపాలెం, పెద్దమదిన, గున్నెంపూడి, సీతయ్యపేట, తురకలపూడి గ్రామాల్లో రైతులు ఉదయం నుండి పొలాల్లోనే వరి పంటను కుప్పలుగా పెట్టే పనిలో నిమగమై ఉన్నారు. పలు గ్రామాల్లో ఆర్‌జెఎల్ రకం ఇంకా కోత కోయకుండా పొలాల్లోనే ఉంది.
వరి చేను కోతలు ముమ్మరం
గొలుగొండ:ఖరీప్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో ఈ ఏడాది 6వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. విప్పలపాలెం, దారపాలెం, రావణాపల్లి ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా ఉండటంలో పంటలు బాగా పండాయి. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి కోతలు ప్రారంభం కావడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది. అధిక కూలీ ఇవ్వాల్సి రావడంతో సాగు వ్యయం పెరుగుతోందని రైతులు వాపోతున్నారు.










