ఒకో ఉద్యమం ఒకో పాఠం మాకు. ఒకో పోరాటం ఒక పాఠశాల మాకు. ఎందుకంటే ఉద్యమించకుండా పోరాడకుండా ఒకరోజైనా గడవనివ్వరు పాలకులైన తమరు. కొత్త కొత్త ఆయుధాలతో దాడి చేస్తుంటారు. కోరి ఓటేసి అధికారం అప్పగిస్తే కోటి విధాల బాధలు పెడతారు. కోటీశ్వరులకే కొలువు చేస్తారు. అందుకే మా కోసం మేము పోరాడతాం. చేతులు కలిపి గొంతులు కలిపి ఒక్క తాటిపై నడుస్తాం.
అలజడి మా జీవితం/ఆందోళన మా ఊపిరి/ తిరుగుబాటు మా వేదాంతం
ఎందుకంటే అలజడిపాలు చేసేది మీరు. దానికి విరుగుడు ఆందోళన. అంతకు మించిన తిరుగుబాటు. మీ పెత్తనం శ్రుతి మించినపుడు, మా మనుగడకే మరణశాసనం రాసినపుడు మా పోరాటాలు మహా ప్రవాహాలవుతాయి. సముద్ర తరంగాలవుతాయి. ఆ ఉధృతికి ఉక్కిరి బిక్కిరవుతారు మీరు. ఉక్రోషంతో ఊగిపోతారు. బలప్రయోగంతో చెలరేగిపోతారు. కుట్రలలో ఇరికించాలని చూస్తారు.
అయినా మేము తలవంచం. జెండా దించం. కుట్రలు ఛేదిస్తాం. ఐక్యత చూపిస్తాం, అప్పుడు మీరు మరీ రెచ్చిపోతారు. మమ్ముల్ను తిట్టిపోస్తారు, తూలనాడతారు. ధన్ కా బాత్ దాచి మీ మన్‌కా బాత్ వెళ్లగక్కేస్తారు.
మేము ఆందోళన జీవులమంటారు.
నిజమే. మేము ఆందోళన జీవులమే. మహాకవి ఎప్పుడో చెప్పింది చూశారు కదా...మేము పోరాడుతూనే వుంటాము. పోరాడి సాధిస్తామే గాని మీ తిట్లకూ లాఠీ పోట్లకూ చెదిరిపోము, బెదిరిపోము.
రైతులం మేము రాజధానిని స్థంభింప చేసి నూటయాభై రోజులుగా ఆందోళన చేస్తుంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కాని జీవితమే మమ్ముల్ను పోరాటంలోకి నెట్టింది. ఒకతాటి పైకి తెచ్చింది. మీరనుకున్నారు ఇదేదో వారం పదిరోజులకు నెల రోజులకు ముగిసిపోయే ముచ్చట అని. అలా గాకుండా అయిదో మాసం ఆగమిస్తుంటే అల్లాడిపోతున్నారు. ఈ కాలమంతటా ఎన్ని పాచికలు వేశారు? ఎన్ని పాతకాలకు పాల్పడ్డారు? మీ నిర్వాకాలకూ నీతి మాలిన చట్టాలకు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మేము తప్పనిసరై పోరాటం లోకి వస్తే చలిలో ఆకలిలో ఉక్కుమనిషిలా పోరాడుతుంటే మాపై ముద్రలేస్తారా? కర్షకులను ఖలిస్తానీలంటారా? వేర్పాటువాద బురద పులమాలని చూస్తారా? మట్టి మనుషులమే కాదు మహా గట్టి మనుషులం మేము. నేల తల్లిని నమ్ముకున్న మాకు ఈ నేల స్వభావమే కాదు. మీలాంటి ఏలికల పోకడలూ తెలుసు. అయినా మేము మట్టితో పాటు ఎదిగిన వాళ్లం, ఈ గడ్డ మీద పెరిగిన నేతలు, మేధావులు, విజ్ఞానులే కాదు మా బిడ్డలైన యువ కిశోరాలు, మహిళా మణులు కార్మికులు, ఉద్యోగులు అందరి అభిమానంతో పోరాటం నడుపుతున్నాం.
సాగునా లోకాలు/ ఆగవా జీవాలు/ రాజుగా మనమెంచి రైతు చూడకపోతే..
ఎప్పుడో స్వాతంత్య్ర పోరాట కాలంలోనే శెట్టిపల్లి వెంకటరత్నం కవి కళ్లకు కట్టాడు. కాని మీలాటి వాళ్లకు కళ్లు తెరుచుకోవు, మీకు అదానీలు అంబానీలే రాజులు. అన్నీ వాళ్లకు కట్టబెట్టడమే మీ కాషాయ యజ్ఞ పరమార్థం. అందుకే దొడ్డిదోవన రైతు వ్యతిరేక శాసనాలు తెచ్చారు. వెనక్కు తీసుకోకపోగా అంతకంటే అధర్మంగా చట్టసభలో ఆమోదించామనిపించారు. ఒక సభలో మీకు బలముంది గనకా ఇంకో సభలో ప్రాంతీయ పక్షులు అవకాశవాదంతో బలపర్చాయి గనక అక్కడ మీ ఆటలు సాగివుండొచ్చు గాని బయిట ఈ బహిరంగ స్థలంలో బైఠాయించిన వేలాది రైతన్నల ముందు, రైతు సంఘాల సమిష్టి పోరాటం ముందు సాగుతాయా? అందుకే అలా నిలిపివుంచాం త్రిశంకు స్వర్గంలో... మార్గ మధ్యంలో....18 నెలలు వాయిదా వేస్తామంటూ మభ్యపెట్టే మాటలు మేమెలా ఒప్పుకుంటాం? చట్టాలున్నా మద్దతు ధర వుంటుందని మాయజేస్తే బుట్టలో పడతామా? విశ్వ సంపన్నులతో బేరమాడుకుంటే మాకు గిట్టుబాటు ధర వస్తుందని నమ్మబలికితే మోసపోతామా? పోము గాక పోము. అందుకే ఆందోళన చేస్తూనే వున్నాం ఆందోళనా జీవులం, మీరన్నట్టు పరాన్న జీవులం మాత్రం కాదు. ఆ బాపతు వారితో మీరున్నారు. వారి పల్లకీలే మోస్తున్నారు. అదే పల్లవి ఆపకుండా ఆలపిస్తున్నారు. మీది వంచనా రాగమైతే మాది వేల గొంతుల పోరాట గీతం, సమర సంగీతం.
చేరి మూర్ఖుల మనసు రంజింపలేము అని మాకు తెలుసు గనకే దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమై వచ్చాం. ఆధునికత మేళవించి అన్నపానీయాల నుంచి అన్ని విషయాల్లో కట్టుదిట్టం చేసుకున్నాం. అప్పుడు పౌర చట్ట సవరణ వ్యతిరేక పోరాటంపై మీరెంత దారుణంగా ప్రవర్తించారో చూశాం గనక మరింత అప్రమత్తంగా వుండి కుట్రలు వమ్ము చేశాం. మీరు నీళ్లు నిలిపేశారు. సరిహద్దులు మూసేశారు. దారులు ఆపేశారు. అయితేనేం మా సంకల్పాన్ని కదిలించలేరు.
మీ అమానుషం అంతర్జాతీయ సమాజానికే ఆగ్రహం తెప్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మీరు నిరంతర భజన చేసే అమెరికా దాకా అంతటా ప్రజాస్వరాలు మాకు గొంతు కలిపాయి. సామాజిక మాధ్యమంలో సమాంతర వాణిగా మారారు, అదీ మీకు మింగుడు పడక వారినీ దూషించారు. చివరకు మీ దూషణలూ దోషారోపణలే మిగిలాయి. మా పోరాటం మాత్రం నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. ఎప్పుడైనా వచ్చి చూడండి యాభై వేలమందిమి పలకరిస్తాము, ప్రశాంతంగా ప్రజాస్వామికంగా పోరాడుతామే గాని క్రమశిక్షణ భంగపరచం. కుటిల శక్తులకు అవకాశమివ్వం, ఎందుకంటే మేము రైతు బిడ్డలం. మీ వ్యవసాయ సంక్షోభంలో మాడిపోయిన వాళ్లం, గంటకు ఇద్దరి చొప్పున ప్రాణాలు తీసుకున్నవాళ్లం, మాకు ప్రాణాలకు తెగించి పోరాడటం పెద్ద సవాలు కాదు. శతాధిక సంఘాలైనా మా అందరిలో రైతు రక్తమే ప్రవహిస్తోంది. నిన్న పంజాబ్ హర్యానా అంటూ పరిమితం చేసి చూపారే...ఈ రోజు అఖిల భారతం అభినందనలతో సౌహార్ద్రత ప్రకటిస్తోంది. ఇప్పుడు భారత దేశమే ఆందోళన దేశం. భరత మాతే పెద్ద ఆందోళన జీవి. ఆమె బిడ్డలమైన మాకందరికీ పోరాటం నేర్పిన సమరశీలి. దేశభక్తి ఒక మంత్రం, కుతంత్రం కాదు మహాశయా ప్రజాతంత్రం. ప్రజాశక్తి ప్రభంజనం. అదే మా పోరాటానికి ప్రాణ వాయువు. నడిపించే జీవనాడి. దేశమంతా గొంతు కలిపిన ఈ దశలోనైనా తమరు కళ్లు తెరిస్తే సంతోషం. లేకుంటే మరింత తీవ్ర పోరాటమే సమాధానమవుతుంది. పదండి ముందుకు పదండి తోసుకు అంటూ 'ముందుకే పోతాం మేము. ప్రపంచం మా వెంట వస్తుంది.' దుశ్శాసనాలనూ దురంతాలనూ దునుమాడేదాకా ఆగదు. పలుకుల పాలకా పారాహుషార్. ప్రజాశక్తి వెన్నాడుతుంది జరూర్.
* పీ.పీ










