Sep 06,2023 22:40

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మెట్ట మండలాల్లో సాగు చేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పొలాలు నీరు కోసం పొలాలు నోరెళ్లబెడుతున్నాయి. రూ.వేలు ఖర్చు పెట్టి సాగు చేసిన ఫైర్లు కళ్ళముందే ఎండిపోతుండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి వర్షపాతం నమోదు తక్కువగా ఉండడంతో నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
తునిలో 6,677 ఎకరాల్లో వరి పంట వేయాల్సి ఉండగా కేవలం 1080 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. రౌతులపూడి మండలంలో 5,335 ఎకరాలకుగాను 1,017 ఎకరాల్లో, జగ్గంపేటలో 10,522 ఎకరాలకు 9 వేల ఎకరాలు, శంఖవరంలో 3,647 ఎకరాలకు 2,700 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. సాగు నీరు లేని కారణంగా ఇలా అనేక ప్రాంతాల్లో రైతులు సాగు చేపట్టలేకపోయారు.
పుష్కర ఉత్తపోతల పథకమేనా..
తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం రైతులకు అక్కరకు రాకుండా పోతోంది. వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ పథకం కింద వచ్చే సాగునీరు రైతులకు ఎంతో మేలు చేసేది. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఒక్క చుక్క కూడా సాగు నీరు రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోదావరి జలాలను లిఫ్ట్‌ చేసి మెట్టకు అందించేందుకు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఎత్తిపోతల పథకం క్రింద 1.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల సాగునీటితో పాటు 18 మండలాలకు తాగునీరు కూడా అందుతుంది. కాకినాడ జిల్లా పరిధిలో గండేపల్లి మండలం తాళ్లూరు లిఫ్ట్‌ 1 కింద 26 వేల ఎకరాలు, లిఫ్ట్‌ 2 పరిధిలో 4,700, పెద్దాపురం లిఫ్ట్‌ 1, 2 పరిధిలో 24 వేల ఎకరాలు, పెద్దనాపల్లి లిఫ్ట్‌ పరిధిలో 1,852 ఎకరాలు, ధర్మవరం లిఫ్ట్‌ పరిధిలో 1080, కొడవలి లిఫ్ట్‌ పరిధిలో 22 వేల ఎకరాలు ఆయకట్టు సాగవుతోంది.
పని చేయని మోటార్లు
ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు రాకపోవడంతో ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. పుష్కర ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. ప్రతి సంవత్సరం జూన్‌ మొదటి వారంలో సాగునీటిని విడుదల చేయాల్సి ఉంది. సెప్టెంబర్‌ మొదటివారం దాటుతున్న చుక్కా నీరు కూడా విడుదల చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిని లిఫ్ట్‌ చేసే మోటార్లు అన్ని పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు పని చేయడం లేదు. వాస్తవానికి వీటిని ఖరీఫ్‌ సీజన్‌కు ముందే బాగు చేయాల్సి ఉన్నా నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. రూ.28 లక్షలు నిర్వహణ ఖర్చులు అవుతుందని అధికారులు అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు వాటర్‌ ఎక్కువగా ఫ్లో అవుతుండడం వల్ల తరచూ పైపులైన్లు పగిలిపోతున్నాయి. ప్రభుత్వం కాలువల ఆధునీకరణ ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక సమస్యలు నడుమ సాగునీరు అందక పొలాలన్నీ ఎండిపోతున్నాయి.