జెర్బెరాలు అందమైన పువ్వులు పూచే ఇండోర్ మొక్కలు. ఆకారంలో, పరిమాణంలో ఇవి అచ్చంగా పొద్దుతిరుగుడు పువ్వులా ఉంటాయి. అరచేతి పరిమాణంలో ఉండే జెర్బెరాలు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి తెలుపు, పసుపు, ఎరుపు, గులాబీ రంగుల్లో పువ్వులు పూస్తాయి. బహుళ వర్ణాల్లో పువ్వులు పూచే జెర్బెరాలు కూడా ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి. దీనిమొక్క అడుగు ఎత్తు వరకూ పెరిగి, మధ్యలో నుంచి సన్నని పొడవాటి కాడ వచ్చి, దానికి చిగురున పువ్వు విచ్చుకుంటుంది. పువ్వు మధ్యభాగంలోని పుప్పొడి ఎంతో రమణీయంగా ఉంటుంది. శీతాకాలంలో జెర్బెరాలు బాగా విచ్చుకొని, మొక్క నిండుగా పూస్తాయి. పువ్వు కోయకుండా ఉంటే 15 రోజుల వరకూ వాడిపోదు. కోసిన పువ్వులు మూడు నుంచి ఐదు రోజుల వరకూ నిగారింపుగా ఉంటాయి. అందుకే వీటిని మండపాల అలంకరణకు, బొకేల తయారీకి విరివిగా వాడుతున్నారు. ఇవి నిజానికి శీతల దేశాలకి చెందిన మొక్కలు. మట్టి కాకుండా కొబ్బరి పొట్టులో ఇవి బాగా పెరుగుతాయి. పెద్దగా నీటి వనరు అవసరంలేని మొక్కలు ఇవి.
పాన్షిటియా వైట్ డ్వార్ప్ ఇండోర్
శ్వేతకాంతులు విరజిమ్మే సీజనల్ పూలమొక్కిది. పది అంగుళాలు పొడవులోనే మొక్క చక్కగా పెరిగి తెల్లటి పెద్ద పెద్దరేకుల వంటి పువ్వులను విచ్చుకుంటుంది. పూ రేఖలు, ఆకులు రంగులో తేడా తప్ప ఒకే ఆకారం, పరిమాణంలో ఉంటాయి. అడుగున ఆకులు పచ్చగా ఉంటాయి. నవంబర్ రాగానే ఒక్కో ఆకు పూరేఖగా, ఏప్రిల్ మొదలవ్వగానే పువ్వు రేఖలు ఆకులుగా మారుతుంటాయి. అందుకే దీన్ని ఊసరవెల్లి మొక్కనీ పిలుస్తుంటారు.
డ్రసీన్యా విక్టోరియా వైట్
మరో ఆర్నమెంటల్ ఇండోర్ మొక్క డ్రసీన్యా విక్టోరియా వైట్. మొక్కకు చుట్టూతా పొడవాటి తోకల్లాంటి ఆకులు విరబూసి ఉంటుంది. అంగుళం నుంచి అంగుళన్నర వెడల్పు ఉండే ఈ ఆకులు మధ్య భాగంలోని ఆకుపచ్చచార, చుట్టూ తెల్లని ఎడ్జ్‌తో చూడముచ్చటగా ఉంటాయి. నిజానికి డ్రసీన్యాలో వందల రకాల మొక్కలు ఉన్నాయి. అధునాతన రకానికి చెందిన ఈ డ్రసీన్యా విక్టోరియా వైట్ ప్రస్తుత మార్కెట్టులో డిమాండున్న మొక్క. బెడ్‌రూమ్‌లో టీపారు పక్కన, హాల్లో సింహద్వారానికి ఇరువైపులా, ఇంటిమూలల్లో వీటిని కుండీలతో సహా అలంకరించు కుంటారు. ఇవి చీకట్లో కూడా కాంతిగా ఉంటాయి.
మరంటాపెయింటెడ్
మరంటాపెయింటెడ్ మొక్క ఇండోర్ మొక్కల్లో మరో అద్భుతం. దీని ఆకులు చిత్రంగా చిత్రాలు గీసినట్లు పెయింట్ వేసినట్లు ఉంటాయి. ఆకుపచ్చని ఆకుల మీద తెల్లనిరూళ్ళ వంటి గీతలుంటాయి. పత్రం కింది భాగము చింతపిక్క రంగులో ఉండి, ప్లాస్టిక్ మాదిరిగా మెరుస్తూ ఉంటుంది. వీటి ఆకులు దళసరిగా ఉంటాయి. ఒక్కో ఆకు మూడు నుంచి ఐదు నెలల వరకూ నిగారింపుగా ఉంటాయి. ఈ అందమైన ఆకుల మీద నీళ్లు చల్లితే మొక్క మరింత అందంగా కనబడుతుంది. నెమ్మదిగా పెరిగే మరంటాపెయింటెడ్‌కు నీటివసతి పెద్దగా అవసరం లేదు.
స్నేక్ ప్లాంట్
ఇంటిలోపల, బయట వాతావరణాలలో పెంచుకోగలిగే అపురూప మొక్క స్నేక్ ప్లాంట్. ఇది చూడ్డానికి విచిత్రంగా ఆర్నమెంటల్ ప్లాస్టిక్ వస్తువులా ఉంటుంది. ఆస్పరాగేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కకు చాలా పేర్లు ఉన్నాయి. శాన్స్‌వేరియా, ట్రిఫాసియాటా లారెంటి అని కూడా పిలుస్తారు. దీని సాధారణ పేరు మదర్ ఇన్లాస్‌టంగ్, స్నేక్ ప్లాంట్, సాన్సేవేరియా, బౌస్ట్రింగ్ జనపనార, డెవిల్స్ నాలుక, జిన్ నాలుక, పాము నాలుకలాంటి ఎన్నో పేర్లు కలవు. ఇది సతత హరిత ప్రాంత మొక్క. ప్రపంచంలో చాలా దేశాల్లో వాడుకలో ఉన్నాయి. ఇది ఆకుపచ్చ, లేత పసుపురంగుల కలబోతతో ఉంటుంది. ఐదు అడుగుల నుంచి మూడడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. చాలా నెమ్మదిగా పెరుగుతుంది. గ్లాస్ హౌసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో వీటిని అలంకరణగా వాడుతున్నారు. గడ్డిజాతి మొక్క. కుండీ మొదల్లో పాలరాతి ముక్కలు వేస్తే మొక్క మరింత అందంగా ఉంటుంది.
డ్రసీన్యా లైమ్లేట్
ఇది ఆకర్షణీయమైన ఇండోర్ మొక్క. సన్నగా పొడవుగా చెరకు మొక్క ఆకులు మాదిరిగా వీటి పత్రాలు చుట్టూ విస్తరించి ఉంటాయి. ఆకులు లేత పసుపుపచ్చ, ముదురాకుపచ్చగాను ఉంటాయి. మొవ్వలో ఉండే ఆకులు లేత పసుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. ఆకులు కిషలయ విన్యాసం చేస్తూ హరిత కళను అద్దుతాయి. ఇటీవల వీటి ఆకులను పెళ్లి మండపాల అలంకరణకి ఉపయోగిస్తున్నారు.
క్రిప్టాంథస్ రెడ్
క్రిప్టాంథస్ రెడ్ అరుదైన ఇండోర్ ఆర్నమెంటల్ మొక్క. దీని చుట్టూతా దళసరిగా గట్టిగా ఉండే ఆకులు విస్తరించి ఉంటాయి. పత్రాలు అంగుళం వెడల్పులో పొడవుగా వెనుకవైపు వాలుంటాయి. ఆకులు గులాబీ రంగులో ఉండి, వాటి మధ్యలో నల్లటి చారలు ఎంతో కళగా ఉంటాయి. డైనింగ్ టేబుల్ టీపారుల పైనా అల్మారాల్లోను అలంకరించుకోవడానికి ఈ మొక్క ఎంతో అందంగా ఉంటుంది. ఇది నెమ్మదిగా ఎదిగే మొక్క. దీనికి చాలా తక్కువ నీటివనరు అవసరం. దీన్ని కొబ్బరి పొట్టులో పెంచడం శ్రేయస్కరం.
చిలుకూరి శ్రీనివాసరావు,
8985945506