Sep 05,2021 19:10

పాదు (క్రీపర్‌) మొక్కలు తీగల్లా అల్లుకుపోతాయని మనకు తెలుసు. కానీ మొదళ్లు పెనవేసుకుపోయే మొక్కలూ ఉన్నాయి. వీటిలో కొన్ని సహజంగా పెరిగేవైతే, మరికొన్ని నిర్వాహకులు నైపుణ్యంతో తయారుచేసి పెంచేవి. సాధారణంగా మొక్కల ఆకులు, పువ్వులు, మొగ్గలు, కాయలు, కొమ్మలు, చిగుళ్లు అందంగా విచ్చుకుని ఎంతో శోభనద్దుతాయి. కానీ ఈ పెనవేసుకుపోయే మొక్కల కాండాలు కూడా అందమైన అల్లికతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. అలాంటి మొక్కలేమిటో తెలుసుకుందాం..

మొక్కల పెంపకంలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెనవేసుకుపోయే మొక్కలకు గిరాకీ పెరుగుతోంది. కడియం నర్సరీల్లోనూ ఇలాంటి మొక్కలు విస్తృతంగా తయారుచేసి, దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇందులో వందలాది జాతుల మొక్కలున్నాయి. ఇండోర్‌, ఔట్‌డోర్‌ రకాల మొక్కలూ ఉన్నాయి.

సెన్సివేరియా డొమస్టికా
చూడ్డానికి ములక్కాడల్లా ఉండే అరుదైన మొక్కలు సెన్సివేరియా డొమస్టికా. మనం స్నేక్‌ ప్లాంట్స్‌ అని పిలిచే జాతి మొక్కలు. వీటిని అల్లి పెంచితే, పెరిగేకొద్దీ పెనవేసుకుపోతాయి. తక్కువ కాంతి అంటే ఎండలేని ప్రాంతంలో బాగా పెరుగుతాయి. వీటికి మధ్యలో రెడ్‌ రిబ్బన్‌ కడతారు. ఇవి 10, 15 రోజులు నీళ్లు లేకపోయినా తట్టుకుంటాయి. వీటి అల్లికలోనూ రకాలుంటాయి. ఒక్కో రకం అల్లికకి ఒక్కో రకం అందం.

గొట్టంలా టెర్మినేలియా మొక్క
గొట్టంలా అల్లుకుపోయే మరో అపురూపమైన మొక్క టెర్మినేలియా మెంటాలీ. మొక్కలుగా ఉన్నప్పుడే వీటిని గొట్టంలా అల్లుతారు. ఆ తరువాత పెరిగేకొద్దీ అవే పెనవేసుకుంటాయి. మొదలు గొట్టంలా పెరిగి, చెట్టు కొమ్మలతో ఆహ్లాదంగా విచ్చుకుంటాయి. లేత ఆకుపచ్చ రంగులలో చిన్ని చిన్ని ఆకులు కనువిందు చేస్తాయి. నెలకోసారైనా మొక్క ఆకారాన్ని కత్తిరించుకోవాలి.

తాడు మొక్క
మొక్క కాండం అచ్చంగా తాడు అల్లినట్టు ఉండే మొక్క స్కప్లోరా మినియేచర్‌. ఇది డ్వార్ప్‌ (పొట్టి) జాతి ఇండోర్‌ మొక్క. ఒక్కో గుత్తికి చిన్ని చిన్ని ఏడు ఆకులు ఉంటాయి. మొక్క చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని టేబుల్‌ మీద, కబోర్డులో, అల్మారా, టీపారు మీద ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. హరిత కాంతులు విరజిమ్మే ఈ మొక్క ఎక్కడున్నా హైలెట్‌.

ఫైకాస్‌ బెంజిమైనా
ఇది సహజసిద్ధ స్పైరల్‌ మొక్క. దీని కాండం దానికదే అల్లుకుపోతుంది. వందలాది రకాలున్న ఫైకాస్‌లో ఇదో రకం. చిన్ని చిన్ని ఆకులు గుబురుగా వచ్చి, మొక్క చాలా అందంగా ఉంటుంది. బోన్సారు మొక్కగా ఈ రకం మొక్కలను ఎక్కువగా తయారుచేస్తుంటారు.

రేడర్‌ మచీరా
మరో ఆకుపచ్చ అందమైన మొక్క రేడర్‌ మచీరా. ఇది ఇండోర్‌, అవుట్‌డోర్‌లో పెరిగే వెసులుబాటు ఉన్న మొక్క. దీని ఆకులు అచ్చంగా కానుగ మొక్క ఆకుల్లా ఉంటాయి. దీన్ని చైనా డాల్‌ అని కూడా పిలుస్తారు. మొదళ్లు అందగా పేనుకుని, మొక్క కాస్తంత పొడుగ్గా అందంగా ఉంటుంది.

తడిక మొక్క
ఫైకాస్‌ జాతికి చెందిన పదుల సంఖ్యలో మొక్కలను అందంగా అల్లి, తయారుచేసే మొక్కను తడిక లేదా దడి మొక్క అంటారు. ఫైకాస్‌ క్లూజియా రోసీయా జాతికి చెందిన మొక్కలను ఎక్కువగా ఇలా తయారుచేస్తారు. ఇది బయటి వాతావరణంలో పెరిగే మొక్క. దాబా గార్డెన్స్‌లో కేబిన్స్‌లా పార్టిసియన్‌ చేయడానికి ఈ మొక్కలను వాడతారు. మొక్కల ప్రపంచంలో ఇటువంటి అల్లికలు ఓ అద్భుతం. వీటికి దీర్ఘచతురస్రాకారంగా ఉండే ప్రత్యేక కుండీలు ఉంటాయి. నీటి వనరు సమానంగా అవసరం. మొక్క కొమ్మలు పెరిగినప్పుడల్లా కటింగ్‌ చేసుకోవాలి.

గుడ్‌ లక్‌ బెంబో
బెంబో స్టిక్స్‌ను అందమైన ఆకారాల్లో అల్లితే అవి చక్కగా పెనవేసుకుంటూ పెరుగుతాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ మొక్కలు మట్టి లేకుండా నీటి పాత్రల్లో పెరగడం విశేషం. వీటిలో వందల రకాలున్నాయి. వారానికోసారి నీళ్లు మార్చాలి. ఇవి ఇండోర్‌ రకం మొక్క. వీటిని ఇంట్లో ఎక్కడైనా అలంకరించుకోవచ్చు.

జడ మొక్క పచీరా
మొక్క మొదలు అచ్చంగా వాలుజడ అల్లినట్టుగా ఉండేది పచీరా. దీన్ని బ్రైడల్‌ మొక్క అని ముద్దుగా పిలుస్తారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న మొక్క జాతి ఇది. నాలుగైదు మొక్కలు కుండీలో పెంచి, వాటిని జడ అల్లినట్టు నైపుణ్యంతో చుడతారు నిర్వాహకులు. ఆ తరువాత పెరిగేకొద్దీ అవే అల్లుకుపోతాయి. ఈ మొక్కకు పొడుగ్గా మావిడాకుల్లా ఉండే పత్రాలు రమణీయతను అద్దుతాయి. వీటిని ఇంటి లోపల, బయటా పెంచుకోవచ్చు. ఆరునెల్లకోసారి కొమ్మలు కత్తిరించి, ఆకారం మలుచుకోవాల్సి ఉంటుంది.
*  చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506