పర్యావరణం ముప్పునెదుర్కొంటున్న విషయాన్ని మనం ఎప్పుడు ప్రస్తావించినా, ''మీకు పర్యావరణం ముఖ్యమా? లేక అభివృద్ధి ముఖ్యమా?'' అంటూ చర్చను దారి తప్పించే వాదనలను ముందుకు తెస్తారు కొందరు. మళ్ళీ బాగుచేసుకోలేనంతగా పర్యావరణాన్ని దెబ్బ తీసేది అభివృద్ధి అని అనిపించుకుంటుందా? మానవజాతి మనుగడనే ప్రమాదంలోకి నెట్టేది అసలు అభివృద్ధి ఎలా అవుతుంది? ఇదీ అసలు ప్రశ్న.
కొద్ది వారాల క్రితం నీతి ఆయోగ్ ''లిటిల్ అండమాన్ దీవి-నిలకడైన అభివృద్ధికి మార్గం'' పేర ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఈ పత్రం పబ్లిక్‌కి అందుబాటులో లేదు. కాని దీని గురించి పలు పత్రికలలో కథనాలు వచ్చాయి. ఆ కథనాలను వేటినీ నీతి ఆయోగ్ ఖండించలేదు. అంటే పరోక్షంగా అటువంటి ఒక డాక్యుమెంట్ ఉందని ఒప్పుకున్నట్టే. పత్రికలలో వచ్చిన వివరాలను బట్టి లిటిల్ అండమాన్ దీవిలో ఒక ఆధునిక నగరాన్ని నిర్మించే ఒక ప్రాజెక్టును నీతి ఆయోగ్ తయారు చేసింది. లిటిల్ అండమాన్ దీవి గ్రేటర్ అండమాన్ దీవి తర్వాత అతి ఎక్కువ జనాభా కల దీవి. ఈ దీవిని ఒక టూరిస్టు హబ్ గా, ఫైనాన్షియల్ సర్వీసుల హబ్‌గా, ఆధునాతన సదుపాయాలున్న హోటళ్ళతో, విమానాశ్రయంతో, కన్వెన్షన్ సెంటర్లతో, సింగపూర్‌ను, హాంకాంగ్‌ను తలదన్నేలా నిర్మించాలన్నది తమ లక్ష్యంగా నీతి ఆయోగ్ ఆ పత్రంలో తెలిపింది. కేవలం ఒక పత్రాన్ని రూపొందించడానికే ప్రభుత్వం పరిమితం కాలేదు. భారతీయ కార్పొరేట్ సంస్థలతోను, కొన్ని విదేశీ సంస్థలతోను చాటుమాటుగా చర్చలు కూడా జరిపారు.
ఈ ప్రాజెక్టును మూడు జోన్లుగా రూపొందించారు. మొదటి జోనును తూర్పు తీరం వెంబడి 102 చ.కి.మీ. ప్రాంతంలో నిర్మిస్తారు. అందులో పూర్తి స్థాయి విమానాశ్రయం ఉంటుంది. అన్ని తరహాల విమానాలూ దిగేవిధంగా దానిని నిర్మిస్తారు. దానితోబాటు ఎయిరో సిటీ ఉంటుంది. ఒక విస్తారమైన జెట్టీ ( బోట్లు, చిన్న పడవలు ఉండే రేవు), టూరిజం సెంటర్లు, కన్వెన్షన్ సెంటర్లు, మెడి సిటీ (ఆస్పత్రుల సముదాయం) ఉంటాయి. రెండవ జోను 85 చ.కి.మీ. ప్రాంతంలో ఉంటుంది. దీనిని ప్రాచీన అరణ్యంలో నిర్మిస్తారు. ఇందులో ఒక టూరిజం ఎస్‌ఇజెడ్, ఫిలిం సిటీ, నివాస గృహ సముదాయం ఉంటాయి. ఇక మూడవ జోను 52 చ.కి.మీ. ప్రాంతంలో నిర్మిస్తారు. నేచర్ రిట్రీట్, ఫారెస్ట్ రిసార్ట్, ప్రకృతి వైద్య కేంద్రాలు ఉంటాయి. ఇవి కాక, అండర్ వాటర్ రిసార్టులు, కాసినోలు, ఆఫీసులుగా వాడుకోదగిన రీతిలో తయారైన కాంప్లెక్స్‌లు, డ్రోన్ పోర్ట్‌లు ఉంటాయి. ఇవి కాక, తూర్పు, పశ్చిమ తీరాలను కలుపుతూ ఒక రింగ్ రోడ్డు 100 కి.మీ. పొడవున నిర్మిస్తారు. అందులో ఒక ట్రాన్స్‌పోర్ట్ సిస్టం నిర్మిస్తారు.
ఈ మూడు జోన్లు కలిపితే మొత్తం 250 చ.కి.మీ. ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. లిటిల్ అండమాన్ దీవి మొత్తం విస్తీర్ణం 737 చ.కి.మీ. దాదాపు మన ముంబై, లేదా హైదరాబాదు విస్తీర్ణంతో సమానం. ఇందులో సుమారు 700 చ.కి.మీ. ప్రాంతం రిజర్వు ఫారెస్టు, ఇందులో 450 చ.కి.మీ. ప్రాంతం ఓంగే రిజర్వు గా ప్రత్యేకించబడింది. ఇందులో ఓంగే అనే ప్రాచీన తెగకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. తొందరగా అంతరించిపోతున్న ఈ తెగ ప్రజలు పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్ (పివిటి) గా పరిగణించబడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు కోసం ఇక్కడున్న రిజర్వు ఫారెస్టులో 32 శాతం- అంటే 224 చ.కి.మీ. అడివిని నిర్మూలించబోతున్నారు. సుమారు 20 లక్షల చెట్లను నరికివేయబోతున్నారు. ఇందులో ఓంగే రిజర్వులోని 135 చ.కి.మీ. ప్రాంతం- దాదాపు 30 శాతం- కూడా ఉంది.
ఈ ప్రాజెక్టు వలన ఇక్కడున్న ఓంగే జాతి మరింత వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని, జెయింట్ లెదర్‌బ్యాక్ సముద్రపు తాబేళ్ళు ఈ ప్రాంతంలోనే గుడ్లు పొదుగుతాయని, అవి కూడా ఈ ప్రాజెక్టు వలన అంతరిస్తాయని, పర్యావరణానికి చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని అటవీశాఖ ముందునుంచీ అభ్యంతరాలు తెలిపింది. ఆ అభ్యంతరాన్నింటినీ పూచికపుల్లలా తీసిపారేశారు ప్రభుత్వ నేతలు. ప్రాజెక్టు వలన ఎవరైనా ఓంగే గిరిజనులు నిర్వాసితులైతే వారికి వేరే చోట పునరావాసం కల్పిస్తామని చాలా నిర్లక్ష్యంగా స్పందించారు.
అండమాన్ దీవుల సముదాయంలో ఉంటున్న నాలుగు ప్రధాన నీగ్రిటో తెగలలో ఓంగే తెగ ఒకటి. ప్రస్తుతం వారి సంఖ్య కేవలం 110. ఇప్పుడు లిటిల్ అండమాన్ దీవి లో బంగ్లాదేశ్ నుండి 1971 యుద్ధం తర్వాత వచ్చిన శరణార్ధులు, నికోబార్ దీవులనుండి వచ్చినవారు కలిపి 18000 ఉన్నారు. పశ్చిమ ప్రాంతంలో ఓంగే గిరిజనులు రెండు రిజర్వు ఫారెస్టులలో ఉంటున్నారు. సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వచ్చిన తొలినాటి తెగలలో ఓంగే తెగ ఒకటి. గతంలో బ్రిటిష్ వారిపాలన లోను, తర్వాత భారత ప్రభుత్వ పాలన లోను ఈ ప్రాంతంలోని తెగల ప్రజలు పలు దాడులను ఎదుర్కొన్నారు. ఇతరులు ఈ ప్రాంతాలకు వచ్చి స్థిరపడి వీరిని మూలమూలలకు నెట్టివేశారు. జరావా అనే తెగకు చెందిన మరో తెగ ప్రజలు ఈ విధమైన చర్యల ఫలితంగా నేడు పూర్తిగా అంతరించిపోయారు. ఇప్పుడు ఓంగే తెగ ప్రజలు కూడా అంతరించిపోయే ప్రమాదం దాపురించింది. కాని ఈ ప్రభుత్వానికి ఆ విషయంలో ఏమీ పట్టడం లేదు.
2017 లోనే అండమాన్ దీవుల అభివృద్ధి పేరుతో బిజెపి ప్రభుత్వం రకరకాల పథకాలను రూపొందించింది. ఇందుకోసం ఒక కమిటీని వేశారు. దానికి హోం మంత్రి చైర్మన్. విడివిడిగా తయారైన పథకాలన్నింటినీ కలిపి ఒకేఒక ప్రాజెక్టుగా ఇప్పుడు నీతి ఆయోగ్ ద్వారా ముందుకు తీసుకువచ్చారు.తీర ప్రాంత నిబంధనల నుండి ముందే మినహాయింపులు ఇచ్చేశారు. పర్యావరణ అనుమతులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు అన్నీ ముందే వచ్చేశాయి!
ప్రస్తుతం అండమాన్ దీవులకు ఏటా నాలుగు లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పదుల లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తారని అంచనాలు కట్టి చూపిస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రధాన భూభాగంలో కూడా అంతమంది టూరిస్టులు రావడంలేదు. అటువంటప్పుడు ఆ అభివృద్ధి ఏదో ప్రధాన భూభాగం మీదనే చేసి ఆ టూరిస్టులను ఇక్కడికే రప్పించవచ్చును కదా?
మిలిటరీ పరంగా వ్యూహాత్మకమైన మలక్కా జలసంధి అండమాన్ దీవులకు కేవలం 100 కి.మీ. దూరంలో ఉంది. మిలిటరీ వ్యూహంలో అమెరికాతో జత కట్టిన భారత్‌కు చైనాపై ఘర్షణ పడడానికి అండమాన్ దీవులలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం అవసరమవవచ్చు. నేరుగా ఆ పని చేయకుండా ముందు టూరిజం పేరుతో బైటనుంచి జనాలను పెద్ద సంఖ్యలో అక్కడ దింపి ఆ తర్వాత అసలు ఎజండా ను అమలు చేయవచ్చునన్నది బహుశా దీని వెనుకనున్న ఆలోచన కావచ్చు.
అయితే ఈ ప్రాజెక్టు నివేదికలేవీ ఇక్కడ పొంచి వున్న ప్రమాదాలను ఏమాత్రమూ పట్టించుకున్నట్టు లేదు. అండమాన్ దీవులు తరచూ భూకంపాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతం. 2004 భూకంపం, దానితోబాటు వచ్చిన సునామీ ఇక్కడి దీవుల సముదాయాన్ని సర్వనాశనం చేసింది. నికోబార్, కార్ నికోబార్ దీవుల్లో నివసించే జనాభాలో దాదాపు 20 శాతం ఆ ప్రమాదంలో అంతరించారు. అక్కడి చిట్టడవుల్లో 90 శాతం అంతరించాయి. చాలా దీవులు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని దీవులు రెండు, మూడు ముక్కలుగా చీలిపోయాయి. లిటిల్ అండమాన్ దీవి సునామీ దెబ్బకు తన తీర ప్రాంతంలో చాలా భాగాన్ని కోల్పోయింది. సముద్రం మట్టం పెరిగితే ఈ దీవి మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. 2100 నాటికి ఈ దీవి మానవ నివాసానికి పనికిరాకుండా పోవచ్చునని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బహుశా మాల్దీవులను చూసి, అక్కడ జోరుగా సాగుతున్న టూరిజం వ్యాపారం చూసి మనమూ ఆ విధంగానే అండమాన్‌లో చేయవచ్చు అనుకుంటున్నారేమో తెలియదు. మాల్దీవులకు ఏటా 5 లక్షల మంది టూరిస్టులు వస్తూంటారు. కాని ఆ టూరిజం కారణంగా అక్కడి పగడాల దీవులు, మత్స్య సంపద, పర్యావరణం బాగా దెబ్బతిన్నాయి.
మూడేళ్ళ నుండీ అండమాన్ అభివృద్ధి ప్రాజెక్టు పై చర్చలు జరుగుతున్నాయి. కాని ఇంతవరకూ పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకి రాలేదు. బహుశా ఇక్కడ ఉన్న ప్రమాదాలను, ఇబ్బందులను చూసి వెనక్కు తగ్గి వుండాలి. లేదా, అంత లాభసాటి కాదని ఆగిపోయి వుండాలి. నిజంగా అండమాన్ దీవులను అభివృద్ధి చేయాలంటే అందుకు చాలా ఆచరణాత్మకమైన పథకాలు ఉన్నాయి. కాని ఈ ప్రభుత్వం అటువంటి ప్రత్యామ్నాయాలను పట్టించుకునే ఆలోచనను కూడా చేయడంలేదు.
* రఘు (స్వేచ్ఛానుసరణ)










