
ప్రజాశక్తి - తాడికొండ : నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి అవినీతిమయంగా మార్చారని, అందినకాడికి దోపిడీకి తెగబడి నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించించారని వైసిపి నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ధ్వజమెత్తారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు తాడికొండ నియోజకవర్గంలో 'వై నీడ్ ఏపీ జగన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైసిపి నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ తెలిపారు. ఫిరంగిపురం, మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు మండలాల్లోని సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సచివాలయం పరిధిలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను చూపుతామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామన్నారు. పార్టీ మండల అధ్యక్షులు గ్రామంలో నిద్రిస్తారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చారన్నారు. రెండవ విడతలో తాడికొండ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుందని చెప్పారు. ఆయనవెంట నాయకులు బి.వెంకటేశ్వరరెడ్డి, కె.శేషగిరిరావు, కె.సిద్దయ్య, ఎం.రాజేష్, టి.వెంకటరెడ్డి, అబ్బాస్ పాల్గొన్నారు.