
ప్రజాశక్తి-కంభం రూరల్
రాష్ట్రంలో ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. శనివారం కంభం మండలం కంభం-2 సచివాలయం పరిధిలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. ముందుగా పలువురు వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ జగనన్న ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు తమ పంటలకు సలహాలు, సూచనలు, ఎరువులు, పురుగు మందులు వంటివి తెలుసుకోవచ్చన్నారు. తద్వారా తమ పంటలు కాపాడుకోవచ్చు అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి, జగనన్నకు, తనకు అండగా ఉండి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్పిటిసి పలువురు కొత్తపల్లి జ్యోతి, వైసీపీ నాయకులు చెగిరెడ్డి ఓబుల్ రెడ్డి, కొత్తపల్లి శ్రీనివాసులు, కంభం సర్పంచి పల్నాటి బోడయ్య, హజరత్ గూడెం సర్పంచి మహబూబ్ పీరా, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.