Jul 06,2023 21:50

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్త అంబులెన్సును ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నూతనంగా మంజూరైన రెండు అంబులెన్స్‌లను గురువారం జగ్గయ్యపేట పట్టణంలోని మిట్టగుడెంలో ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆపద సమయంలో అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్స్‌ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేశారన్నారు. ప్రజల వద్దకే పాలన విధంగా రోగుల వద్దకే వెళ్లి వారిని తీసుకొని సంబంధిత వైద్యశాలలకు చేర్చి ఆపద సమయంలో వారికి ఈ 108 అంబులెన్సులు ప్రాణ రక్షణ కల్పిస్తున్నాయని అన్నారు. నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్లు జగ్గయ్యపేట మండలానికి ఒకటి, వత్సవాయి మండలానికి ఒకటి చొప్పున కేటాయించారని తెలిపారు. ఆపద సమయంలో రోగులు, ప్రమాదంలో గురైన క్షతగాత్రులు గాని వారిని చూసినవారు కానీ వారి ప్రాణాలను రక్షించేందుకు 108 నెంబర్కు కాల్‌ చేసి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్‌ బాజీ, వార్డ్‌ కౌన్సిలర్లు సాదుపాటి రాజు, దువ్వల రామకష్ణ, హాస్పటల్‌ అభివద్ధి కమిటీ సభ్యులు కటారి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.