Feb 17,2023 23:58

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సుభద్ర

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మృతి చెందిన శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్‌ నిమిత్తం కేజీహెచ్‌ ఎస్టి సెల్‌లో సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మృతి చెందిన శిశువు తల్లిదండ్రులు చెండ మత్స్య కొండబాబు, మహేశ్వరి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన వీరు తమ ఆవేదనను సుభద్ర, అధికారులకు వివవరించారు. విశాఖ కేజీహెచ్‌ కు శిశువును తరలించామని, అక్కడ సరైన వైద్యం అందించకపోవడంతో శిశివు మృతి చెందిందని తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మృతి చెందితే అంబులెన్స్‌ ఇవ్వడం కుదరదని, ప్రైవేట్‌ వాహనం లేదా, సంచిలో మూట కట్టి బస్సులో వెళ్ళి పొండని కెజిహెచ్‌ ఎస్టీ సెల్‌ సిబ్బంది సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామంలో విశాఖ ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, పాడేరు అడిషనల్‌ డిఎం అండ్‌ హెచ్‌ఓ లీలా ప్రసాద్‌, డిస్టిక్‌ టీబి కంట్రోల్‌ అధికారి టి.విశ్వేశ్వరనాయుడు బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్‌ వాహనంలో తీసుకువచ్చే స్థోమత లేక పోవడంతో స్కూటీ పై విశాఖ నుండి పాడేరు వరకు 120 కి.మీ తీసుకొచ్చామని బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు పాడేరు నుండి కుమడ వరకు వాహనాన్ని ఏర్పాటు చేసి స్వగ్రామంలో చేరవేసారని తెలిపారు. గతంలో అనేకమంది గిరిజనులు ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు బస్సుల్లో, సొంత వాహనాల్లో శిశు మృతదేహాలు తరలించిన సంఘటనలు అనేకం అని గుర్తు చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు గిరిజన ప్రాంతంలో జరగడం చాలా బాధాకరమని, బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్వీఎస్‌ రమేష్‌, పంచాయతీ కార్యదర్శి గోపి, వైద్య సిబ్బంది, వైసిపి సీనియర్‌ నాయకులు కూడా మత్స్య లింగం గ్రామస్తులు పాల్గొన్నారు.