Oct 31,2023 21:54

సిరిమానోత్సవానికి హాజరైన జనం

ఉత్తరాంధ్రుల కల్పవల్లి, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని మంగళవారం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఎప్పటిలాగే పాలధార, అంజలి రథం, తెల్లఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా, పైడితల్లి ఆలయపూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై మూడుసార్లు అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు ఊరేగారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు.

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, కోట :  
సిరిమానోత్సవం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 4.35గంటలకు ప్రారంభమైంది. హుకుంపేట నుంచి సిరిమాను తరలింపు ఆలస్యం కావడంతో పాటు రథాన్ని సిద్ధం చేయడంలో ఆలస్యం కావడంతో గంటన్నర ఆలస్యంగా ఉత్సవం ప్రారంభమైంది.
ఎస్‌పి ఎం.దీపిక, కలెక్టర్‌ నాగలక్ష్మి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధారాణి, ఆర్‌జెడి సురేష్‌బాబు, ఆర్‌డిఒ సూర్యకళ తదితరులు సిరిమాను ముందు నడిచారు. అత్యంత ఘనంగా జరిగిన అమ్మవారి సిరిమానోత్సవం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు బందోబస్తును, మూడు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి గంటస్తంభం, బాలాజీ జంక్షన్‌, గుమ్చీ, అంబటిసత్రం నుంచి ఆలయం వైపు వాహనాలు వెళ్లకుండా నిలుపుదల చేశారు. మధ్యాహ్నం 1గంట వరకు దర్శనాలకు అవకాశం కల్పించారు. నగర ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా వచ్చిన వేలాది మంది అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
మున్సిపల్‌ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. తాగునీటి సదుపాయం కల్పించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా తాగునీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.

సిరిమానోత్సవాన్ని పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా తిలకించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆశీనులై ఉత్సవాన్ని తిలకించింది. ఆయనతో పాటుగా రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కంబాల జోగులు ఇతర ప్రముఖులు, అధికారులు సైతం ఇక్కడినుంచే ఉత్సవాన్ని తిలకించారు. మాన్సాస్‌ చైర్మన్‌, పైడితల్లి ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, వారి కుటుంబ సభ్యులు కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించారు.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తన సతీమణి బొత్సఝాన్సీలక్ష్మి, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఇఒ మంత్రి అమర్నాధ్‌కు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, విశాఖరేంజ్‌ డిఐజి హరికృష్ణ, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారిని మన్సాస్‌ సంస్థచైర్మన్‌, టిడిపి పోలిట్‌బ్యూరో బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆయన సతీమణి సునీలాగజపతి అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, సినీనటుడు సాయికుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

కార్పొరేషన్‌ సేవలు భేష్‌
సిరిమానోత్సవం సందర్భంగా కమిషనర్‌ శ్రీరాములు నాయుడు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాదరావు ఆధ్వర్యాన అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మెరుగైన సేవలు అందించారు. సిరిమానుపై భక్తులు విసిరిన అరటిపండ్లు, తదితర వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు.

ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, పైడితల్లి ఆలయ ఇఒ సుధారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌. శ్రీరాములునాయుడు, ఇతర అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి, పైడిమాంబ దేవస్థానం, వైద్యారోగ్యశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాన్స్‌కో తదితర సుమారు 25 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సమన్వయంతో కృషి చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వీరిని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. సిరిమానోత్సవం, విజయనగరం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, ప్రజలందరికీ కలెక్టర్‌ కతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌ ఆధ్వర్యంలో పోలీసు శాఖ అందించిన సేవలు ప్రశంసలను అందుకున్నాయి.