Feb 04,2023 22:59

ఘనంగా హేలాపురి బాలోత్సవం ప్రారంభం
తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి 'పాడుదమా స్వేచ్ఛా గీతం'
'వందలాది మంది విద్యార్థులు.. తాము పాల్గొనదల్చిన పోటీలకు అనుగుణంగా వేషధారణ.. వెరసి ఆ ప్రాంతమంతా కళకళలాడుతుండగా.. 'పాడుదమా స్వేచ్ఛాగీతం' అంటూ అంతా చిన్నారులు రెట్టించిన ఉత్సాహంగా చేసిన ఆలాపన అందరినీ మంత్రముగ్దులను చేసింది.
ప్రజాశక్తి - ఏలూరు

                హేలాపురి బాలోత్సవం పేరిట మూడో పిల్లల సంబరాలు స్థానిక సర్‌ సిఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో శనివారం ఉదయం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభ మయ్యాయి. బాలోత్సవం ప్రారంభ సూచికంగా జాతీయ జెండాను, బాలోత్సవం జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాలోత్సవం ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. సభలో ముఖ్యఅతిథి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ నేటి కంప్యూటర్‌ యుగంలో పిల్లల్లో ఆటపాటలు, విజ్ఞానదాయక కార్యక్రమాలు కనుమరుగై యాంత్రికంగా తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కులు, ర్యాంకులే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు భాగస్వాములు కావాలని, అప్పుడే వారిలో మానసిక పరిపక్వత వస్తుందని అన్నారు. బాలోత్సవ కార్యక్రమాలను విస్తరింపజేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. మరో ముఖ్యఅతిథి జిల్లా రెవెన్యూ అధికారి ఎవిఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ మారిన పరిస్థితుల్లో పిల్లలు తమ కీలకమైన బాల్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాఠశాల విద్యలో క్రాఫ్ట్‌, ఉడ్‌ వర్క్‌, డ్రాయింగ్‌ తదితర అంశాలుండేవని ఆయన గుర్తు చేశారు. బాల్య జ్ఞాపకాలు జీవితాంతం ఉంటాయని, కాబట్టి ఇలాంటి బాలోత్సవాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. డిఇఒ అవధాని మాట్లాడుతూ అందరికీ విద్య అందాలన్నారు. ప్రతిరోజూ విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలతోపాటు గ్రంథాలయాల్లోని పుస్తకాలను అధ్యయనం చేయాలన్నారు. సిఆర్‌ రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్‌ ఎంబిఎస్‌వి.ప్రసాద్‌ మాట్లాడుతూ బాలోత్సవాల నిర్వహణ కష్టతరమైనప్పటికీ బాగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అమరావతి బాలోత్సవ నిర్వాహకులు పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ పిల్లల మానసిక వికాసానికి తోడ్పడుతున్న బాలోత్సవ కార్యక్రమాలను ఉద్యమ తరహాలో విస్తరింపజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వంకినేని రఘుకుమార్‌, ప్రిన్సిపల్‌ సాయికుమారిశంకర్‌, స్కూల్‌ డైరెక్టర్‌ రాజ్‌ కల్‌, దీపక్‌ నెక్స్‌జెన్‌ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, మానవత జిల్లా అధ్యక్షులు ఆర్‌.గంగాధర్‌, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్‌.వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, కోశాధికారి విజిఎంవిఆర్‌.కృష్ణారావు, మారుబోయిన కోటేశ్వరరావు, అడుసుమిల్లి నిర్మల, డి.హేమసుందర్‌, ముస్తఫా ఆలీ, కట్టా సత్యనారాయణ, జె.సత్యనారాయణరాజు, మేతర అజరుబాబు, కె.శ్రీనివాస్‌, పి.కిషోర్‌, డిఎన్‌విడి.ప్రసాద్‌, ఎంఎస్‌ఎంఎస్‌.కుమార్‌, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.రవికుమార్‌, పివి.నరసింహారావు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు
60 రకాల కల్చరల్‌, అకడమిక్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. జానపద నృత్యం, విచిత్ర వేషధారణ, కోలాటం, శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలాపన, లఘు నాటిక, ఏకపాత్రాభినయం తదితర కల్చరల్‌ పోటీలతోపాటు క్విజ్‌, తెలుగులో మాట్లాడటం, కథ చెప్పడం, వక్తృత్వం, చిత్రలేఖనం తదితర అకడమిక్‌ పోటీలు నిర్వహించారు.
తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో 'పాడుదమా స్వేచ్ఛా గీతం'
'పాడుదమా స్వేచ్ఛా గీతం' దేశభక్తి పాటను బాలోత్సవం సందర్భంగా వెయ్యి మందికిపైగా ఒకేసారి పాడటంతో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు. స్థానిక సిఆర్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో బాలోత్సవం ప్రారంభ సభ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో 'పాడుదమా స్వేచ్ఛా గీతం' పాట నమోదు కోసం చేపట్టిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పాడుదమా స్వేచ్ఛా గీతం నమోదైనట్లు సర్టిఫికెట్‌, మెడల్‌ ఆహ్వాన సంఘ నాయకులకు అందజేశారు.