Sep 19,2023 23:39

ప్రజాశక్తి - చెరుకుపల్లి
గత 32ఏళ్ల క్రితం చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు వెడల్పు పేరుతో తొలగించడం మానుకోవాలని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే చర్యలు మానుకోవాలని కోరుతూ మంగళవారం నుండి చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్లో దళిత ప్రజా సంఘాల నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షకు జై భీమ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు దోవా రాంజీ సంఘీభావం ప్రకటించారు. దళిత సంఘాల పోరాట ఫలితంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే చర్యలు మానుకోకపోతే ఆందోళన లను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది శ్రావణ్ కుమార్ నేతృత్వంలో హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటి జిల్లా కార్యదర్శి కె శరత్, పొందుగల చైతన్య, జాలాది ఇస్సాక్, పెరికల మురళి పాల్గొన్నారు.