Oct 11,2023 01:00
చెరుకుపల్లి ఐల్యాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం

ప్రజాశక్తి-చెరుకుపల్లి: చెరుకుపల్లి ఐలాండ్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహాన్ని అక్కడే ఉంచాలని, ఎట్టి పరిస్థితులలోనూ తొలగించవద్దని దళిత సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరుకుపల్లికి చెందిన గురిందపల్లి సిద్ధార్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రోడ్ల ఆక్రమణ తొలగింపు అంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించడం అక్రమమని, ప్రభుత్వం ఏ నిబంధనలూ పాటించకుండా తొలగిస్తోందంటూ సిద్ధార్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించకుండా తొలగించే ప్రయత్నాలు చేస్తోందని న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని తొలగించకుండా హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చి, విచారణను గురువారానికి వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు సమర్పించాలని వారు ఆదేశించారు.