Oct 05,2023 01:08

ప్రజాశక్తి - చెరుకుపల్లి
స్థానిక ఐలాండ్ సెంటర్లోని డాక్టర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించనీయమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ అన్నారు. ఐలాండ్ సెంటర్లో 32ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహన్ని జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిని దళిత నాయకులు వ్యతిరేకిస్తు ఆందోళన చేశారు. వారిపై అధికారులు బెదిరింపులకు పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువతపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైతే విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న దళిత సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. విగ్రహాన్ని తొలగించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట దళిత ప్రతినిధులు, చెరుకుపల్లి తహశీల్దారు బి వెంకటేశ్వర్లు, మంచాల విజయ్, కిషోర్ బాబు, సిద్ధార్థ, మురళి పాల్గొన్నారు.