ప్రజాశక్తి - చెరుకుపల్లి
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద రహదారి మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకుండా రెండు వైపులా రహదారి నిర్మించాలని దళిత సంఘాల నాయకులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం సమంజసం కాదని పేర్కొన్నారు. రహదారి మధ్యలో ఉండటం వలన విగ్రహాన్ని తొలగించే అవసరం లేకుండా రహదారి నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అటు వైపు వెళుతున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావుకు వినతి పత్రం అందజేశారు. పునరాలోచన చేసే విధంగా అధికారులు, దళిత సంఘాల నాయకులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, కె శరత్, సిద్ధార్థ, సురేష్, ఇస్సాకు, మురళి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు.










