
అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన
దుండగులను కఠినంగా శిక్షించాలి : ఐయుఎంఎల్
ప్రజాశక్తి - నంద్యాల రూరల్
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సెంటర్‌లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చేతి వేలు, ముక్కును పగలగొట్టి రాజ్యాంగాన్ని అవమానపరిచిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా రఫీ ఉద్దీన్ మజాహిరి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ సలాంతో కలిసి మాట్లాడారు. భారత రాజ్యాంగం సృష్టించిన గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు ఎలాంటి భద్రత లేదని, గతంలో ఎంతోమంది విగ్రహానికి మెయిన్ సెంటర్‌కు మార్చాలని చెప్పినా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోవడం వలనే ఈరోజు ఈ ఘటనకు దారి తీసిందన్నారు. అంబేద్కర్ విగ్రహానికి మెయిన్ సెంటర్‌లో పెట్టాలని, లేనిపక్షంలో ఐయుఎంఎల్ ఆధ్వర్యంలో అదే స్థలంలో ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










