
ప్రజాశక్తి -నక్కపల్లి:
అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ బద్దంగా హెటిరో పైపులైనుకు వ్యతిరేకంగా పోరాడతామని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, మత్య్సకారులు స్పష్టం చేశారు.హెటిరో మందుల కంపెనీ కొత్తగా వేస్తున్న పైపు లైన్ కు వ్యతిరేకంగా మత్య్సకారులు తలపెట్టిన శాంతియుత మహాధర్నా శుక్రవారం 498వ రోజుకు చేరింది. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, హెటిరో మందుల కంపెనీ చట్టాలను ఉల్లంఘించి, రాజకీయ పలుకుబడితో బలాన్ని ఉపయోగించి నిరుపేదలైన మత్య్సకారుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. మత్స్యకారుల ఉపాధిని, ఆరోగ్యాలను దెబ్బ దెబ్బ తీస్తుందన్నారు. 498 రోజుల నుండి పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఐక్య పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను, చట్టాలను నమ్ముకుని న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు.ఈ పోరాటంలో న్యాయం, ధర్మమే గెలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోసల సోమేశ్వరరావు, చేపల సోమేష్, పిక్కి తాతీలు, కోడా కాశీరావు, మైలపల్లి జాను, మైలపల్లి బాపూజీ, కారే కోదండ పాల్గొన్నారు.