ప్రజాశక్తి-విజయవాడ: అంబేద్కర్ పార్కును సందర్శకులకు అనువైన రీతిలో అభివృద్ది పనులు చేపట్టడానికి అధికారులు చర్యలుతీసుకోవాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలిసి కమిషనర్ అంబేద్కర్ పార్కును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్క్ ఆవరణలో పచ్చదనాన్ని అభివృద్ది చేయాలన్నారు. నిరూపయోగంగా ఉన్న రోప్‌వేకు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. సందర్శకులకు వినియోగపడటానికి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ పాల్గొన్నారు.
పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలి
వివిధ రకాల పన్నుల చెల్లింపుదారుల్లో అవగాహన కల్పించి, సకాలంలో పన్నులు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బీసెంట్ రోడ్‌లోని 98వ వార్డ్ సచివాలయాన్ని సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పని తీరుతో పాటు అందుబాటులో ఉన్న రికార్డ్‌లను కమిషనర్ పరిశీలించారు. 23వ డివిజన్ పరిధిలోని 93, 97, 98 , 25వ డివిజన్ పరిధిలోని 94, 95, 96 అడ్మిన్‌లతో పన్నులు వసూలు విధానంపై కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను, డ్రైనేజి పన్ను, ఖాళీ స్థలాల పన్ను తదితర పన్నుల చెల్లింపు విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించి సత్వరమే పన్నులు చెల్లించే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా వంద శాతం డిఅండ్ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనసూయదేవి, జోనల్ కమిషనర్ సజన పాల్గొన్నారు.










