
కోనసీమను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించిన తర్వాత కోనసీమ ప్రాంతంలో చెలరేగిన అల్లర్లు విచారకరం. రాష్ట్రంలో మొదటి విడతగా సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి. ఎవరు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. రెండవ దఫా ప్రభుత్వం అంబేద్కర్ జిల్లాగా ప్రకటించి అభ్యంతరాలు ఏమైనా వుంటే తెలియజేయమని 30 రోజులు గడువు ఇచ్చింది. శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో వ్యక్తులైనా, సంస్థలైనా, రాజకీయ పార్టీలైనా తమ అభ్యంతరాలను తెలియ జేయవచ్చు. సమాజంలో హిందుత్వాన్ని, కుల వ్యవస్థ దుర్మార్గాన్ని, వ్యతిరేకించి పోరాడిన వ్యక్తిగా అంబేద్కర్‌ను మనం గౌరవించుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించిన తరువాత గృహ దహనాలు, మంత్రుల ఇళ్లపై దాడులు, ప్రజా ప్రతినిధులు ఇళ్లపై దాడులు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులను ధ్వంసం చేయటం చాలా విచారకరం.
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడటానికి, వేళ్లూనుకోవటానికి, వివిధ రకాల మత చర్యల ద్వారా రాష్ట్ర ప్రజల విభేదాలను వాడుకోవటానికి భారతీయ జనతా పార్టీ చూస్తున్నది. ఇటీవల కాలంలో గుంటూరు జిన్నా టవర్‌ను కూల్చివేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల మధ్య మనోభావాలను రెచ్చగొట్టారు. మనువాదాన్ని నరనరాన జీర్ణించుకున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మత వాదాన్ని, కులతత్వాన్ని రాష్ట్రంలో రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కులతత్వ, మతతత్వ వాదానికి పరోక్షంగా సహకరిస్తున్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించిన అంశంపై రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) పెట్టాలనటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు, విధానాలకు మద్దతు పలకడమే. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాకు అవసరం లేని రిఫరెండం ఒక్క కోనసీమ అంబేద్కర్ జిల్లాకు పెట్టాలనటం సరైనది కాదు. కోనసీమ ఘటన వెనుక వ్యవస్థాగతంగా పనిచేస్తున్న హిందుత్వ కాషాయ శక్తులు, అగ్రవర్ణ కులతత్వ శక్తులు బలీయంగా ఉన్న విషయాన్ని యావత్ ప్రజానీకం గుర్తించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ప్రజల జీవన విధానం కష్టతరమవుతుంది. ఇటువంటి ప్రచారాలను తీసుకొచ్చి ప్రజల రోజువారీ అనేక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదాకి గాని, ప్రత్యేక ప్యాకేజీ గానీ, పోలవరం పూర్తి చేయడం కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవ్వకుండా ... రాష్ట్ర ప్రజల మనోభావాలను మతం వైపు, కులం వైపు నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.
ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రజానీకం సామరస్యంగా, చైతన్యయుతంగా ఆలోచించాలని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని
- మన్నవ హరిప్రసాద్,
కేంద్ర కమిటీ సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్,
సెల్ :93465 08846