ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాపట్ల కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావని అన్నారు. దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి రాజ్యాంగాన్ని రచించారన్నారు. అంబేద్కర్ జీవిత స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరారు. పలువురు దళిత సంఘాల నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డిడి రాజ్ దిబోరా, బాపట్ల రెవెన్యూ అధికారి రవీంద్ర, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, మత్స్య శాఖ జెడి సురేష్, దళిత సంఘాల నాయకులు జి చారువాక, ఇ మాల్యాద్రి, వందనం, శ్రీరాములు, దళిత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో..
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా పోలీస్ అధికారులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్‌పి ఎండిహెచ్ ప్రేమ్ కుమార్, అడ్మిన్ ఆర్‌ఐఎల్ మన్మథరావు, వెల్ఫేర్ ఆర్‌ఐ బి శ్రీకాంత్ నాయక్ ఇతర పోలీస్ అధికారులు, డిపిఓ సిబ్బంది పాల్గొని బిఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.
బాపట్ల: ఆధునిక భారతదేశ నిర్మాత భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను పలు ప్రజా సంఘాల రాజకీయ పార్టీల నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాపట్ల శాసన సభ్యుడు కోన రఘుపతి బాపట్ల వైసీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కోన రఘుపతి ఆయన ఇంటి వద్ద నుంచి వైసిపి నాయకులు, సంఘాల నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కోన నివాళులర్పించారు. రైల్వే స్టేషన్ వద్ద పూలమాలలతో అలంకరించిన అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్ఛాలతో అంజలి ఘటించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కోన ప్రసంగించారు.
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లోని భారీ అంబేద్కర్ విగ్రహానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్‌పై నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










