Aug 13,2023 22:29

డిఇఒ ఆర్‌వి.రమణ
ప్రజాశక్తి - కాళ్ల

              అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి.రమణ అన్నారు. స్థానిక సీసలి గ్రీన్‌ వ్యూ ఇంటర్నేషనల్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీ బహుజన సమాఖ్య రెండో వార్షికోత్సవ వేడకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీ బహుజన సమాఖ్య అధ్యక్షులు, ఫౌండర్‌ సోడదాసి గంగయ్య అధ్యక్షత వహించి మాట్లాడారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన అంబేద్కర్‌ అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. ఈ సమాఖ్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆయన ఆశయాన్ని కొనసాగించేందుకు ఈ సమాఖ్య కృషి చేస్తుందన్నారు. ఉండి, ఆకివీడు, పాలకోడేరు, కాళ్ల మండలాల్లో పదోతరగతిలో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఒక్కొక్కరికి రూ.ఐదు వేల నగదు బహుమతిని డిఇఒ చేతులమీదుగా అందించారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ దాట్ల వెంకట రామరాజుకు రాజా రామ్మోహన్‌రారు సేవా రత్న అవార్డును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ ఎజిఎస్‌.మూర్తి, మంచాల ఐజక్‌, సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ, ఎ.వీరయ్య, సోడదాసీ జయపాల్‌, మహమ్మద్‌ సిద్దిక్‌, సంఘ సభ్యులు గాతల సందీప్‌, కొండా రాజేష్‌ కుమార్‌, బొర్రా పార్థు, గుడిసే అనిల్‌, గ్రామ సర్పంచులు నందమూరి ప్రకాష్‌, గాలి సామ్రాజ్యం పాల్గొన్నారు.