Oct 22,2023 00:21

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జూపూడి ప్రభాకర్‌, వీసీ ప్రసాదరెడ్డి తదితరులు

ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌, అంబేద్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ రచించిన 'అంబేద్కర్‌ ఐడియాలజీ ఇన్‌ ది డిజిటల్‌ ఎరా' పుస్తకాన్ని శనివారం ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో ఆవిష్కరించారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చైర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌, ఏయూ వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి, క్రిష్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జాన్‌ వెస్లీ, ఏయూ పూర్వ పాలక మండలి సభ్యులు యేసుపాదం, ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్‌, ప్రిన్సిపల్‌ ఆచార్య టి.శోభశ్రీ సంయుక్తంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్‌ ఆలోచనలు నేటి సాంకేతికతకు అనుసంధానంగా సామాజిక సమస్యలకు ఏ విధంగా పరిష్కారాలను చూపుతున్నాయనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ వివరించారు. మెత్తం పుస్తకాన్ని 20 చాప్టర్లుగా తీర్చిదిద్దామని, అంబేద్కర్‌ ఆలోచనలు, నేటి సాంకేతిక యుగంలో అంబేద్కర్‌ ప్రాధాన్యత, అంబేద్కర్‌ దృక్కోణంలో డిజిటల్‌ ఎరాలో సామాజిక న్యాయం, సమానత్వం, ఏక్సస్‌ టు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఇన్‌ ద డిజిటల్‌ ఏజ్‌- అంబేద్కర్‌ విజన్‌, డిజిటల్‌ ఏక్టివిజం అండ్‌ సోషల్‌ మూమెంట్స్‌- లెసన్స్‌ ఫ్రం అంబేద్కరైట్‌ మూమెంట్‌, సామాజిక మార్పుకు సోషల్‌ మీడియా దోహదపడుతున్న విధానం, డిజిటల్‌ ప్రైవసీ, డేటా ప్రొటక్షన్‌ అండ్‌ ఇట్స్‌ ఇంప్లికేషన్స్‌ ఫర్‌ మార్జినలైజ్డ్‌ గ్రూప్స్‌, ఏఐ అండ్‌ అల్గారిథమ్స్‌-ఇంప్లికేషన్స్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌, డిజిటల్‌ లిటరసీ అండ్‌ ఎడ్యుకేషన్‌-ఎంపవరింగ్‌ ద మార్జినలైజ్డ్‌ తదితర అంశాలను వివరించారు. పుస్తకంలో 20 చాప్టర్లను ఒక మూక్స్‌ కోర్సుగా తీసుకొచ్చే ఆలోచన ఉందని రచయిత ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ తెలిపారు. ప్రస్తుతం పుస్తకాన్ని అమెజాన్‌ కిండిల్‌లో అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. ఏయూ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాన్ని డిజిటల్‌ మాధ్యమంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. త్వరలో పుస్తకానికి ద్వితీయ సంచికను తీసుకురానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీన్‌లు ఆచార్య కె.బసవయ్య, జి.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ ఆలోచనలను ప్రస్తుత తరానికి చేరువ చేసే విధంగా వర్తమాన అంశాలపై పుస్తకాన్ని రచించిన ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌ని అతిథులు అభినందించారు.
రిజిస్ట్రార్‌ను అభినందించిన జూపూడి
రిజిస్ట్రార్‌గా నియమితులైన ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ అభినందించారు. కార్యాలయంలో కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.