ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలోని కొందరు సచివాలయ అమ్యూనిటీస్ సెక్రటరీలు అందుబాటులో ఉండడం లేదని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ శాంత అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అజెండాలోని అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. కౌన్సిల్‌నుద్దేశించి మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. పట్టణంలోని పాతబస్టాండ్ మైదానంలోని షాపింగ్ కాంప్లెక్స్ హోల్‌సేల్, రిటైల్ షాపులకు గుడ్‌విల్ ఆక్షన్ ద్వారా నిర్మించేందుకు గతంలో కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. దీనికి గాను సాంకేతికపరమైన అప్రూవల్‌కు అనుమతి వచ్చిందని తెలిపారు. ఆదోనికి చెందిన కాంట్రాక్టర్ రాజేంద్రప్రసాద్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించిందని చెప్పారు. మున్సిపల్ పాఠశాలల్లో స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వారికి ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలని, మున్సిపాలిటీ ఎందుకు ఇవ్వాలని 30వ వార్డు కౌన్సిలర్ నాగరత్నమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ద్వారానే 36 పాఠశాలల్లో 36 మంది స్వీపర్లు నెలకు రూ.4 వేల చొప్పున పని చేస్తున్నారని కమిషనర్ వివరించారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున రూ.1.44 లక్షలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కుళాయిలకు నీరు సరఫరా అయ్యే సమయంలో అమ్యూనిటీ సెక్రటరీలు నీటి పరీక్షలు నిర్వహించే వారని, ప్రస్తుతం వారి జాడేలేదని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తనకు కానీ, మున్సిపల్ ఇంజినీర్‌కు కానీ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
మీడియాపై చిరుబుర్రు : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ముగియడంతో సభ్యులు లేవడానికి ప్రయత్నించారు. ఇంతలోనే జోక్యం చేసుకున్న ఛైర్మన్ శాంత కొంతసేపు అలానే కూర్చొని త్వరగా వెళితే విలేకరులు ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారని చిరుబుర్రులాడారు. గత కౌన్సిల్ సమావేశం నిమిషాల్లోనే ముగియడంతో ప్రజా సమస్యలు గాలికొదిలి పెళ్లిళ్లు, పేరంటాలు ఉన్నాయని త్వరగా సమావేశం ముగిసిన సంగతి పత్రికల్లో ప్రచురించారు. దీనిపై ఆమె ఇలా స్పందించారు. అత్యవసర సమావేశం కాబట్టే అజెండాలోని అంశాలు తక్కువగా ఉండడం వల్ల సమావేశం త్వరగా అయిపోయిందని కౌన్సిలర్లు ఫయాజ్ అహ్మద్, సందీప్ రెడ్డి, లక్ష్మీదేవి వివరణ ఇచ్చారు. వైస్ ఛైర్మన్లు గౌస్ అహ్మద్, నరసింహులు, కౌన్సిలర్లు లక్ష్మి, అశోక్, చలపతి, ఉస్మాన్, కీర్తన, సురేష్, కోఆప్షన్ సభ్యులు తిమ్మక్క, డిప్యూటీ ఇంజినీర్ వెంకట చలపతి రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్లు కృపాకర్, రాజశేఖర్ రెడ్డి, ఆర్‌ఒ అస్లాం బాష, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు హరినాథ్, శ్రీనివాసులు ఉన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి










