గుంతకల్లు రూరల్ : ప్రతి ఏటా వేరుశనగ సాగు చేసిన రైతులకు అతివృష్టి, అనావృష్టి కారణంగా పంట చేతికందకుండా పోయింది. పెట్టుబడులు కూడా చేతికరాక అప్పుల ఊబిలో కూరకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి సారించారు. అందులో భాగంగా గుంతకల్లు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు ఆముదం పంట సాగుపై దృష్టి సారించారు. తక్కువ వర్షం, తక్కువ ఖర్చు అయ్యే ఆమదును రైతులు సాగు చేశారు. మండల పరిధిలో దోసలుడికి, సంగాల, కసాపురం, అమిన్‌పల్లి తదితర గ్రామాల్లో దాదాపు వంద హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. పంట సాగుకు ఎకరాకి రూ.10వేల నుంచి నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతంది. పంట ఏపుగా పెరుగుతున్న సమయంలో దీనికి తెగుళ్లు సోకుతున్నాయి. ముఖ్యంగా నామాల అనే తెగుళ్లు పంటను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. నామాల పురుగు ఆశించి ఆముదం ఆకులు, పూతను పూర్తిగా తొలిచివేస్తోంది. చెట్టుకు బర్రలు తప్ప ఏమీ మిగలడం లేదు. పురుగు సంహారానికి ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం శూన్యంగా ఉంది. పురుగు ఆకు కింది భాగాన్ని ఆశించి ఆకులు, పూతను పూర్తిగా తినేస్తోంది. ఈ పురుగు నివారణకు క్రిమిసంహారక మందులు అధికంగా పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడులూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా చేసినా పంట చేతికొచ్చే పరిస్థితి కన్పించడంలేదు. ఆకులు పూర్తిగా తెగుళ్ల బారిన పడడంతో రైతులు చేసేది లేక పంటను తొలగించేస్తున్నారు. పంట ఈ విధంగా దెబ్బతింటున్న తరుణంలో సకాలంలో వ్యవసాధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆముదం రైతులు సతమతం అవుతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి తెగుళ్లు సోకిన ఆముదం పంటను పరిశీలించి రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. పంటను పూర్తిగా నష్టపోయిన వారికి ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.










