Aug 15,2021 06:13

ఎవరికి అమృత తుల్యం, ఎవరికి గరళీకరణం? సరిగ్గా ఈ సమయంలోనే కరోనా తాకిడిని తట్టుకోగల టీకాలు సమకూర్చుకోలేక చికిత్సా సదుపాయాలు కలిగించలేక సతమతమై...జాతీయ ఉత్పత్తి ఉసూరనడం మోడీత్వ ఘనతా? పని లేక పస్తులతో లక్షల వలస కార్మిక కుటుంబాలు రహదారులను, రైళ్లు, బస్సులను నింపేసిన హృదయ విదారక దృశ్యం చెరిగిపోతుందా? శత సహస్ర సంపన్న వర్గాలకు వనరులు, గనులు, రేవులు, దోవలు, విమానాశ్రయాలు, విద్యాలయాలు, ప్రభుత్వ కర్మాగారాలు, బ్యాంకులు, భూములు, రక్షణ రంగం... సమస్తం సమర్పణ చేయడం ఎవరి స్వాతంత్య్రం?
     స్వాతంత్య్రమే నా జన్మహక్కని చాటండి.. కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర సమరం చేయండి.. అంటూ నిన్నటి వీరులు మొన్నటి యోధులు పోరాడి సాధించిన స్వాతంత్య్రం 75వ ఏట ప్రవేశిస్తున్నది. ఇన్నేళ్లలో ఎన్నడూ ఏ నేతా చేయనంత మోతతో మాట్లాడగల ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జాతీయ పతాకం ఎగరేసి సరికొత్త సంకేతాలు ఇవ్వడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.1972లో స్వాతంత్య్ర రజతోత్సవాలనూ, 1998లో స్వర్ణోత్సవాలనూ చూసిన ఈ వ్యాస రచయిత వంటి వారికి అమృతోత్సవాలుగా నామకరణం చేయబడిన 75వ వేడుకలు ఇంత పేలవంగా నామమాత్రంగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది (1991లో మొదలైన సరళీకరణ విధానాలకు ముప్పయ్యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భం కూడా). స్వాతంత్య్రం అనేది కేవలం ప్రభుత్వ ప్రచార పటాటోపమో లేక ఉత్సవ సంరంభమో కాదు. రాజకీయ ఆర్థిక భావ స్వాతంత్య్రాల సమ్మేళనం సమగ్రమైన స్వాతంత్య్రం. ఇందులో ప్రతిదీ కొడిగట్టి పోతున్న పరిస్థితులే అమృతోత్సవాన్ని అధికార లాంఛనంగా మార్చేశాయి. సహస్ర వృత్తుల ప్రజానీకం, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులూ కవి గాయక రచయితలూ అధికార అనధికార ప్రముఖులూ ప్రశ్నించాల్సిన పరిస్థితిని సృష్టించాయి. నిరంతర అప్రమత్తతే స్వాతంత్య్రానికి మూల్యం అని ఎప్పుడో చెప్పారు. 1972లో రజతోత్సవాలు జరిపిన ఇందిరాగాంధీ 1975 నాటికి అత్యవసర పరిస్థితిని పెట్టి హక్కులు హరిస్తే ఈ దేశ ప్రజలు ఆమెను ఓడించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నారు.1997 స్వర్ణోత్సవాల నాటికి వాజ్‌పేయి హయాంలో మొదలైన మతతత్వ రాజకీయాల మొదటి ఘట్టాన్ని ఓడించి లౌకిక విలువలను కాపాడుకున్నారు. పాతికేళ్ల తర్వాత ఇప్పుడు మోడీత్వ రూపంలో తిరిగివచ్చిన ఆ మతతత్వం మలి రూపాన్ని మరింత విపత్కర సవాళ్లనూ అధిగమించడానికి సమాయత్తం అవుతున్నారు.
 

                                                              అత్యున్నత స్థాయి లోనే !

    'మన స్వతంత్రం మేడిపండు, మన దరిద్రం రాచపుండు' అని రజతోత్సవ సమయంలో ఆరుద్ర రాసిన గీతం. జాత్యహంకార జాదూగిరికి పేరుమోసిన ఇజ్రాయిల్‌ నుంచి కొనుగోలు చేసి దేశంలో ప్రథమ శ్రేణి పౌరుల మీదనే నిఘా వేసిన పెగాసస్‌ ఉదంతం కన్నా ఇందుకు ఉదాహరణ అక్కర్లేదు. న్యాయమూర్తులు, జాతీయ పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, ఆఖరుకు పాలక పార్టీ కేంద్ర మంత్రులూ ఏలిన వారి నిరంతర నిఘాలో బతకాల్సి వచ్చిన స్వాతంత్య్రం మనది. ఆ పెగాసస్‌పై చర్చ చేద్దామని నిజాలు తెలుసుకుందామని అత్యున్నతమైన రాజ్యసభలో, లోక్‌సభలో జరిగిన ప్రయత్నం ఏకపక్షంగా నిరాకరించి సభలే చాపచుట్టిన హిరణ్యాక్ష రాజ్యం. విచారణ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తమ సహచరులపైనా వ్యవస్థపైనా నిఘా నడవడం తెలిసి కూడా సాంకేతిక సవాళ్లతో సాగదీస్తున్న ధృతరాష్ట్ర నీతి. హేమాహేమీలైన పాత్రికేయులపైన గూఢచర్యం నడిచినా మీడియా దిగ్గజాలు మోడియా ధర్మమే పాటిస్తున్న వైపరీత్యం. ఈ రోజు కొన్ని తెలుగు ఇంగ్లీషు పత్రికలలో ప్రవచనాలు చూస్తే చాలు మీడియా విద్వాంసుల విలక్షణ విధేయత విదితమవుతుంది. మోడీ, బిజెపి వంటి మాటలు లేకుండా వారు సమస్త నీతులూ సకల సూక్తులూ వల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య హక్కులకు సమాధి కడుతున్నా పలువురు ప్రాంతీయ ప్రభువులు ప్రణమిల్లుతూనే వచ్చారు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ వ్యవస్థలెన్నిటినో రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నా సదరు సంస్థల సారథులు సహకరిస్తూనే వచ్చారు. విశాల విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన విశ్వవిద్యాలయాలపై విష ప్రచారాలతో విద్వేషపూరిత దాడులు చేస్తుంటే విద్వత్తు విస్తుపోయిన విపరీత పరిస్థితి. స్వాతంత్య్ర పోరాట భూమికను విస్త్రుతం చేసిన రైతు ఉద్యమాల వారసత్వం రాజధానిలో ఏడాదిగా నినదిస్తుంటే ఉక్కుపాదంతో అణచబోయి ఉక్కిరిబిక్కిరవుతున్న స్థితి. చరిత్ర నుంచి నేర్చుకోవలసింది పోయి నేర్పాలనుకున్నదే చరిత్ర అని మార్చిపారేసి నిజమైన చరిత్రను అవహేళన చేస్తున్న అఘాయిత్యం. స్వచ్ఛ భారత్‌ కక్ష భారత్‌గా మారి కుల మత సామాజిక వివక్ష, రాజకీయ వివక్ష వికృత రూపం దాలుస్తుంటే స్వాతంత్య్ర పోరాటం కోరుకున్న సమధర్మం సమాప్తగీతం వినిపిస్తున్న వైనం.

                                                 అటు దాడులు, ఇటు ఆహ్వానాల బూటకం

    బంకించంద్రుని వందేమాతరం పోరాటాలకు ఊపిరులూదింది. స్వాతంత్య్ర నినాదమైంది. బ్రిటిష్‌ వారిచ్చిన బిరుదాలను తృణీకరించిన రవీంద్రుని భావస్వరం పునర్వికాసానికి బాటలు వేసింది. గాంధీజీ నాయకత్వం లోని జాతీయోద్యమానికి తోడు కమ్యూనిస్టు భావజాలం ఉద్యమ బలం, సంఘ సంస్కరణల శంఖారావం పడుగూ పేకల్లా కలిసి నవభారత స్వప్నాన్ని రచించాయి. మంచి గతమున కొంచెమేనంటూ మందగించక ముందుకడుగేయమని మహాప్రస్థానానికి పదపదమన్నాయి. ఇది సమస్త భారతీయుల సమిష్టి సమర శంఖారావమైంది. ఆసేతు శీతాచలం ఒక్క తాటిపై నడిచింది. గతాన్ని గౌరవిస్తూనే ఉజ్వల భవితను నిర్మించుకోవాలన్న ఉత్సాహం ఉందిలే మంచికాలం ముందు ముందునా అనిపించింది. ఇంకా ఇంకా గతంలోకి తలదూర్చుదామనే ఉష్ట్రపక్షుల చందంగా సంఘ పరివార్‌ మత చాందస రాజకీయం ఇప్పుడదంతా తలకిందులు. అమృతోత్సవాలకు మోడీ ఎంచుకున్న ఇతివృత్తంలో సనాతనత, అధునాతనత కలపాలనడంలోనే వెనకచూపు ఈ మహత్తర దేశపు ప్రాచీన సంస్కృతిని ఎవరో నిరాకరిస్తున్నట్టు దానికి తామే గుత్తదారులమైనట్టు చెప్పేమాటలు వాస్తవంలో ఆ వైవిధ్య సంస్కృతి లోని వైశిష్ట్యాన్ని వమ్ము చేసే ఏకపక్ష రాజకీయ క్రీడలు మాత్రమే. అయిదు అంశాలను ఈ ఉత్సవాల కోసం దేశం ముందుంచుతున్నామని కేంద్రం ప్రకటించింది. స్వాతంత్య్ర పోరాటం, సాధించిన విజయాలు, కొత్తభావాలు, సాధన, మరింత దృఢ సంకల్పం. అటూ ఇటూ ఎటు తిప్పి ఏం చెప్పినా ఇందులో నూతనత్వం గాని మానవ వికాస కోణం గాని ఏమైనా కనిపిస్తున్నాయా? చట్టసభల్లోనే ప్రతిపక్షం మాట వినని పాలకులు నూతన భావాలు ఆహ్వానిస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారా? ఎర్రకోట ప్రసంగం కోసం ఏమైనా సూచనలు పంపాలని ప్రతిసారీ యాప్‌లో ఆహ్వానం పలకడం, ఆ సమయానికి ఆత్మస్తుతి పరనిందతో సరిపెట్టడం ఏడేళ్లుగా చూస్తున్న తతంగమే. ఈ సారి అది మరింత ముదిరిపోవచ్చు. భావ స్వేచ్ఛను బొత్తిగా సహించలేక సాహిత్యంపైనా సామాజిక మాధ్యమాల పైనా కూడా దాడి చేసే ఈ సర్కారు నూతన భావాలను ఆహ్వానిస్తున్నానడం కన్నా విడ్డూరం ఏముంటుంది?
 

                                                                  వైవిధ్యంపై వైషమ్యం

    భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశపునాది. స్వాతంత్య్ర పోరాట విజయానికి మూల సూత్రం. బ్రిటిష్‌ వారి కుటిలనీతితో చివరి దశలో మత ప్రాతిపదిన దేశాన్ని విభజించినా ఇప్పటికీ భారతదేశం లోనే ముస్లిములు ఎక్కువగా వున్నారు. హిందూమతం ఒక వ్యవస్థీకృత రూపం తీసుకోకముందే భావచైతన్యం పెంచిన బౌద్ధం, జైనం, సిక్కు, పార్శీ, క్రైస్తవ తదితర మతాలెన్నో వున్నాయి. ఏ మత విశ్వాసం లోనూ భాగం కాని ఆదివాసులున్నారు. ఏ మతాన్ని విశ్వసించని విజ్ఞాన వాదులున్నారు. హిందూముస్లిం భాయిభాయి అన్న నినాదం వుంది. ఇలాంటి దేశంలో హిందూ మతాన్ని హిందూత్వగా మార్చేసేందుకు ఆరెస్సెస్‌ కూటమి ప్రయత్నిస్తుంటే స్వాతంత్య్రం సమైక్యత ఎటుపోవాలి? ఈ ఇరు మతాల ఐక్యత అనడం తనకు నచ్చదని ఒకే దేశం ఒకే మతం అని ప్రవచిస్తున్న ఆరెస్సెస్‌ అధినేత 'మోహన్‌ భగవద్గీత' చారిత్రిక వాస్తవికతతో పొసుగుతుందా? పురాణ రుషులూ దేవతలూ కూడా అన్ని రకాల ఆహారాలు ఆరగించిన దేశంలో వస్త్ర వైభవంతో బ్రిటిష్‌ వారినే నిలవేసిన దేశంలో ఆహారం, వేషధారణ కూడా మా ఇష్ట ప్రకారమే జరగాలని శాసిస్తే కుదురుతుందా? మానవులు కన్నా ఆవులకూ మహిళల కన్నా మత విశ్వాసాలకు పట్టం కట్టడం చెల్లుతుందా? రాజా రాంమోహనరారు నుంచి వీరేశలింగం వరకూ ప్రబోధించిన సంస్కరణలను తోసిరాజని ఇతర మతాలకే నీతులు చెబితే ఒప్పుతుందా? ఎవరు ఏ మతాన్నయినా ఆచరించవచ్చునని చెబుతున్న రాజ్యాంగాన్ని పాటించడమవుతుందా?
 

                                                               సర్వ సమర్పణం

     అన్నిటికీ మూలమైన ఆర్థిక స్వాతంత్య్రం మాటేమిటి? ముప్పై ఏళ్ల సరళీకరణ పరాకాష్టకు తీసుకెళ్లి కోటి కోట్ల రూపాయల అప్పులో ముంచడం సర్కారు సమర్థతకు సాక్ష్యమవుతుందా? ఈ ముప్పై ఏళ్లలో సంపద పెరిగిందని వస్తువులు అందుబాటు లోకి వచ్చాయని మురిసిపోయి ముచ్చట్లు చెబుతున్న వారి సమాధానమేమిటి? ఎవరికి అమృత తుల్యం, ఎవరికి గరళీకరణం? సరిగ్గా ఈ సమయంలోనే కరోనా తాకిడిని తట్టుకోగల టీకాలు సమకూర్చుకోలేక చికిత్సా సదుపాయాలు కలిగించలేక సతమతమై...జాతీయ ఉత్పత్తి ఉసూరనడం మోడీత్వ ఘనతా? పని లేక పస్తులతో లక్షల వలస కార్మిక కుటుంబాలు రహదారులను, రైళ్లు, బస్సులను నింపేసిన హృదయ విదారక దృశ్యం చెరిగిపోతుందా? శత సహస్ర సంపన్న వర్గాలకు వనరులు, గనులు, రేవులు, దోవలు, విమానాశ్రయాలు, విద్యాలయాలు, ప్రభుత్వ కర్మాగారాలు, బ్యాంకులు, భూములు, రక్షణ రంగం... సమస్తం సమర్పణ చేయడం ఎవరి స్వాతంత్య్రం? వైదేశిక నీతి లోనూ మనం తరిమికొట్టిన సామ్రాజ్యవాద శక్తులకే ఉపగ్రహాలమై మళ్లీ మనమే గొప్ప అని టముకు వేేసుకోవడం నవ్వులాట కాదా? ఈ ఏడేళ్లలోనూ ఎప్పటికప్పుడు ఉద్వేగాలు పెంచడం కాశ్మీర్‌ రామమందిరం వంటివి ముందుకు తేవడం, దుస్సాహస వాక్కులతో కృత్రిమ ఉద్రేకం రగిలించడం మినహా దేశాన్ని బలోపేతం చేయడానికి ప్రజల అసలైన సమస్యలు పరిష్కరించడానికి పేదల కన్నీళ్లు తుడవడానికి జరిగింది పూజ్యం (గత రెండు రోజులుగా ప్రజాశక్తి, పీపుల్స్‌ డెమోక్రసీ లెక్కలు ఇచ్చినటు)్ట. దేశంలో ఆకాశ కోటీశ్వరులు వందల్లో పెరుగుతుంటే వంద కోట్ల పైన ప్రజలు అగాధం లోకి జారుతుంటే స్వాతంత్య్ర పోరాటం కాంక్షించిన ఆర్థిక సామాజిక సమత ఎక్కడ పోయినట్టు? ప్రధాని ప్రవచనాల్లో ఈ ప్రశ్నలకు మాత్రం బదులుండదు. అయితే ఆయనకు ఆయన నాయకత్వంలోని అభివృద్ధి నిరోధక పాలనా వ్యవస్థకు ప్రజలు తప్సక సమాధానమిస్తారు. స్వాతంత్య్ర సమర చరిత్రను పునరుల్లేఖిస్తారు. ఎందుకంటే అదొక నిరంతర ప్రవాహం. నిశిత పోరాటం. నిబద్ధ సంగ్రామం.
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి