Aug 08,2021 08:16
  • కరోనా మరణాల్లోనూ అవే ముందు
  • తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని తొలి, సెకండ్‌ వేవ్‌ కరోనా కుదిపేసింది. సెకండ్‌ వేవ్‌ నాలుగు నెలల కాలంలో 10,86,892 కేసులు నమోదుతోపాటు 6,324 మంది మరణించారు. ఈ సెకండ్‌వేవ్‌ కరోనా ఎక్కువగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలపై ప్రభావం చూపింది. ఇప్పటి వరకూ ఎక్కువ కేసులు నమోదవడం, ఎక్కువ మంది మరణించడం, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు ఎక్కువగా ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో సెకండ్‌వేవ్‌లో 1,29,878 కేసులు నమోదు కాగా, 1094 మంది మరణించారు. ప్రస్తుతం 3,256 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సెకండ్‌వేవ్‌లో 169,306 కేసులు నమోదు కాగా, 663 మంది మరణించారు. ప్రస్తుతం 3,437 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విస్తీర్ణం ఎక్కువ ఉండటం, జనాభా, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు అధికంగా ఉండటంతోనే ఈ రెండు జిల్లాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
 

                                                                  1908 కేసులు నమోదు

    రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 80,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1908 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 23 మంది మరణించారు. మరో 2,103 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 20,375 యాక్టివ్‌ కేసులున్నాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరిలో 438, చిత్తూరులో 231 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలులో 26, విజయనగరంలో 29 కేసులు నమోదయ్యాయి.
   కరోనా లక్షణాలతో కృష్ణాలో నలుగురు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరిలో ముగ్గురేసి, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశంలలో ఇద్దరేసి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 13,513కు చేరిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.