Amaravati రైతులకు అండగా నిలవండి.. రాకేష్ టికాయిత్‌ను కోరిన అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలవాలని బికెయు (భారతీయ కిసాన్ యూనియన్) నేత రాకేష్ టికాయిత్‌ను అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు కోరారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బికెయు అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రస్టు చైర్మన్ నగినా సింగ్‌ను రైతు పరిరక్షణ సమితి నేతలు ఎ.యుగంధర్, ఐ.ప్రసాద్, ఎ.శ్రీదేవి, సుజన, బి.సూర్యనారాయణ, పి.పరంధామయ్య, జి.జయకృష్ణ కలిశారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం, 29 గ్రామాల రైతుల నుంచి భూ సమీకరణ, రాజధానికి ప్రధాని శంకుస్థాపన, రాజధానిలో నిర్మాణాలు, ప్రభుత్వం మారిన తరువాత అమరావతి పరిస్థితి వంటి అంశాలతో కూడిన 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ అమరావతి' పుస్తకాన్ని వారికి అందజేశారు. రైతుల బాధలను అర్ధం చేసుకొని న్యాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అలాగే రాష్ట్ర రాజకీయ క్రీడలో అమరావతి రైతులు నష్టపోతున్న తీరును రాకేష్ టికాయిత్‌కు వివరించారు. దీనిపై స్పందించిన టికాయిత్ అమరావతి రైతులకు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు రైతు పరిరక్షణ నేతలు పేర్కొన్నారు.