
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి రైతులు, ప్రజలపై ప్రభుత్వ నిర్బంధం గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి 600 రోజులు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం శోచనీయమని తెలిపారు. పైపెచ్చు గ్రామగ్రామాన వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించి, శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని తెలిపారు. నిర్బంధాలను విడనాడాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, శాంతియుత ఆందోళనలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.