
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన వారి సేవలను నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన పోలీస్ అమర వీరుల దినోత్సవంలో మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపి భరత్ రామ్, ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, ఎస్‌పి పి.జగదీష్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులు స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ సేవలో విధులు నిర్వర్తిస్తూ పోలీసులు అందించే సేవలు స్మరించు కోవడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలను స్మరించు కోవాల న్నారు. సమాజంలో శాంతి భద్రతకు పోలీసులు కృషి చేస్తారని, అదే సమయంలో సమాజం కూడా పోలీసుల పట్ల అంతే బాధ్యత కలిగి ఉండాలన్నారు. విధి నిర్వహ ణలో మరణించిన పోలీసుల ఆత్మకు శాంతి, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఎంపి మార్గని భరత్ రామ్, ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ నిరంతరం సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల సేవలు నిరుపమానం అని అన్నారు. అదనపు ఎస్‌పి ఎమ్.రజనీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో అసు వులు బాసిన పోలీసులను పేరు పేరునా స్మరించు కున్నారు. తొలుత మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ పెరేడ్ కమాండెంట్‌గా ఆర్‌ఐ వ్యవహరించారు. అనంతరం సభా కార్యక్రమంలో భాగంగా పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పమాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన హెచ్‌సి (బొమ్మూురు పిఎస్) పి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు పోలీసుల తరపున ఆర్థిక సహాయం, ఆయన సతీమణి దీప్తికి ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి అందించారు. ఈ సంస్మరణ సభలో అదనపు ఎస్‌పి శ్రీనివాస రావు, రుడా మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, హెచ్‌సిలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాళ్లపూడి పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ గణాంక అధికారి జోడాల వెంకటే శ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద్భంగా ఎస్‌ఐ రమణ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము వంటిదన్నారు. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు అమరవీరులయ్యారని, వారిని నిరంతరం స్మరించుకోవాలన్నారు. ఈ ర్యాలీలో నందన ఫౌండేషన్ సభ్యులు రవి, మాంటిస్సోరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు, నాయకులు ముళ్ల మల్లిబాబు, ఆటో యూనియన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.