Aug 12,2023 17:53

ఆచంటలో వర్థంతి సభలో సిపిఎం నేతలు
ప్రజాశక్తి - ఆచంట

             ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించేవారు అతి తక్కువ మందే ఉంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. ఆచంట కచేరి సెంటర్‌లో అమర వీరులైన ప్రేరేప మృత్యుంజయుడు, తాళ్ల బసవ మల్లయ్య, దిగుపాటి ప్రకాశరావు, నెక్కంటి రామదాసు, కరుటూరి సత్యనారాయణల వర్థంతి సభ సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాలన్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. తొలుత ఆచంట వేమవరంలో అమరవీరుల స్థూపం వద్ద నుంచి మోటర్‌ సైకిల్‌ ర్యాలీగా బయలుదేరి, పెనుమంచిలి మీదుగా ఆచంట కచేరి సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం అమర వీరుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బలరాం మాట్లాడుతూ ఆచంటలో ప్రేరేప మృత్యుంజయుడు, వేమవరంలో తాళ్ల బసవ మల్లయ్య అగ్ర గన్యులన్నారు. వారి బాటలోనే దిగుపాటి ప్రకాశరావు, నెక్కంట రామదాసు, కరుటూరి సత్యనారాయణ వంటి త్యాగజీవులందరూ తుది శ్వాస విడిచే వరకు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పని చేశారన్నారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్‌, రాజకీయ శక్తులు పేద సామాన్య ప్రజానీకంపై మోయలేని భారాలను మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగ కార్మికులు, చేతివృత్తులు, చిరు వ్యాపారులు, మహిళలు, విద్యార్థి యువజనులకు నష్టం కలిగించే విధానాలపై రాజీలేని పోరాటాలను నిర్వహించడంలో సిపిఎం అగ్ర భాగాన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సూరినీడి వెంకటేశ్వరరావు, సిఐటియు మండల కార్యదర్శి వర్దిపర్తి అంజిబాబు, పోడూరు, పెనుమంట్ర మండల కార్యదర్శులు, కె.సుబ్బరాజు, పిల్లి ప్రసాద్‌, చిర్రా నరసింహమూర్తి, మచ్చా సుబ్బారావు, చొప్పల మోహన్‌, తలుపూరి బుల్లబ్బాయి, ఎం. బ్రహ్మయ్య, వి.శ్రీను పాల్గొన్నారు.